నిమిషం ఆలస్యమైనా.. నో ఎంట్రీ

31 Aug, 2019 10:44 IST|Sakshi
విజయవాడ నుంచి మండల కేంద్రాలకు తరలిస్తున్న పరీక్ష సామగ్రి 

‘సచివాలయ’ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

జిల్లావ్యాప్తంగా 374 పరీక్ష కేంద్రాలు

హాజరుకానున్న 2,00,655 మంది అభ్యర్థులు

సాక్షి, చిలకలపూడి(కృష్ణా): ఆదివారం నుంచి ప్రారంభం కానున్న గ్రామ, వార్డు సచివాలయ పోస్టులకు సంబంధించి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు ప్రకటించారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షా సమయానికి గంట ముందుగా కేంద్రానికి అభ్యర్థులు చేరుకోవాలన్నారు. అరగంట ముందు పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నట్లు పేర్కొన్నారు.  2,00,655 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానుండగా.. జిల్లా వ్యాప్తంగా 374 కేంద్రాలను సిద్ధం చేశారు. పరీక్షా కేంద్రానికి హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదొక గుర్తింపుకార్డును తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు.  

సిబ్బంది నియామకం..
గ్రామ, వార్డు సచివాలయ పోస్టులను భర్తీ చేసేందుకు నిర్వహించనున్న పరీక్షలకు ఇప్పటికే అధికారులు అవసరమైన సిబ్బందిని నియమించారు. 374 పరీక్షా కేంద్రాలకు 374 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, అడిషనల్‌ చీఫ్‌ సూపరింటెండెంట్లుగా 229 మంది, హాల్‌ సూపరింటెండెంట్లుగా 1, 772మంది, సెంటర్‌ ప్రత్యేక అధికారులుగా 374, రూట్‌ ఆఫీసర్లుగా 100, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది 49 మందితో పాటు ఇన్విజిలేటర్లు 6,054 మందిని ర్యాండమ్‌ పద్ధతిలో నియమించారు. 

నేటి ఉదయం రిపోర్ట్‌ చేయాలి
ఎవరైనా సిబ్బందికి ఏ పరీక్షా కేంద్రంలో విధులు నిర్వహించాలో వివరాలు అందకపోతే వారు ఆయా మండల విద్యాశాఖాధికారులను గానీ మండల ప్రజాపరిషత్‌ అధికారినిగానీ శనివారం ఉదయం సంప్రదించాలని కలెక్టర్‌ కోరారు. అలాగే నియామక ఉత్తర్వులు అందుకున్న వారందరూ వారికి కేటాయించిన సంబంధించి చీఫ్‌ సూపరింటెండెంట్‌కు శనివారం ఉదయం 11 గంటలలోగా రిపోర్ట్‌ చేయాలని కోరారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి కో ఆర్డినేటర్‌గా జిల్లా పరిషత్‌ సీఈఓ షేక్‌ సలాం, జాయింట్‌ కో ఆర్డినేటర్‌గా డిప్యూటీ కలెక్టర్‌ ఎం. చక్రపాణి వ్యవహరిస్తున్నారని తెలిపారు. 

ఇవి తప్పనిసరి : బ్లూ, బ్లాక్‌ పాయింట్‌ పెన్ను, హాల్‌టికెట్, ఏదైనా గుర్తింపుకార్డు
ఇవి నిషిద్ధం : సెల్‌ఫోన్, కాలిక్యులేటర్, వాచ్‌ సహా ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు 

నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు..
పరీక్షల నిర్వహణకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల్లో నిర్వహణపై వీడియో చిత్రీకరణ చేయనున్నారు. అవసరమైన చోట్ల సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. స్ట్రాంగ్‌రూమ్‌ల నుంచి పరీక్షా కేంద్రాలకు సామగ్రిని తరలించేందుకు పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉండేలా పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. పరీక్షా కేంద్రంలోకి వెళ్లే అభ్యర్థులు బ్లూ, బ్లాక్‌ పాయింట్‌ పెన్ను, హాల్‌టికెట్, ఏదైనా గుర్తింపుకార్డు తీసుకురావాలన్నారు. సెల్‌ఫోన్, కాలిక్యులేటర్, వాచ్‌తో సహా ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడవని అధికారులు స్పష్టం చేశారు. అలాగే పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అరగంట ముందుగా ఓఎంఆర్‌ పత్రాలను అందజేస్తారు.

సౌకర్యాలు ఏర్పాటు..
పరీక్షలకు హాజరుకానున్న అభ్యర్థుల కోసం అన్ని పరీక్షా కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు అధికారులు కల్పించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీల్‌చైర్లు, వలంటీర్ల సౌకర్యం దివ్యాంగులకు కల్పించారు. తాగునీరు, నిరంతర విద్యుత్‌ సరఫరా పరీక్షా కేంద్రాలకు వెళ్లే అభ్యర్థుల కోసం ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సు సౌకర్యం కూడా కల్పించారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే అభ్యర్థులకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.

మండల కేంద్రాలకు పరీక్ష సామగ్రి
సాక్షి, విజయవాడ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన గ్రామ సచివాలయ ఉద్యోగాల పరీక్షలకు సంబంధించిన సామగ్రిని అధికారులు మండల కేంద్రాలకు తరలించారు. విజయవాడలో పంచాయతీరాజ్‌ కార్యాలయం, జెడ్పీ అతిథిగృహం నుంచి శుక్రవారం సామగ్రిని డిస్పాచ్‌ చేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ జాయింట్‌ కలెక్టర్‌ –2 మోహన్‌ కుమార్‌ స్వీయ పర్యవేక్షణలో జిల్లాలో పరీక్షలు నిర్వహించే అన్ని మండల కేంద్రాలకు పంపించారు. నిర్ణీత రూట్‌ల ప్రకారం సామగ్రి తరలింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా