నేడు వెబ్‌సైట్‌లో షార్ట్‌లిస్టులు

21 Sep, 2019 04:39 IST|Sakshi

ఉ.11గంటలకు జిల్లాల వారీగా ‘సచివాలయ’ పరీక్షల్లో పాసైన వారి జాబితాలు

నేడు, రేపు సర్టిఫికెట్ల స్కాన్డ్‌ కాపీలను అభ్యర్థులు అప్‌లోడ్‌ చేయాలి

23, 24, 25 తేదీల్లో ఒరిజినల్‌ సరి్టఫికెట్ల వెరిఫికేషన్‌

అపాయింట్‌మెంట్‌ లెటర్ల జారీ బాధ్యత జిల్లా సెలక్షన్‌ కమిటీలదే

అక్టోబర్‌ 1, 2 తేదీల్లో శిక్షణ

అది ముగియగానే రెండో తేదీనే విధుల్లోకి

సాక్షి, అమరావతి : ‘సచివాలయ’ పరీక్షల్లో పాసైన వారి వివరాలతో జిల్లాల వారీగా షార్ట్‌లిస్టు జాబితాలను ఆయా జిల్లా కలెక్టర్లు శనివారం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. వెయిటేజీ మార్కులతో కలిపి అభ్యర్థులకు రాత పరీక్షల్లో వచ్చిన మార్కుల వివరాలు ఆయా జిల్లా కలెక్టర్లకు శుక్రవారం చేరాయి. జిల్లాల వారీగా పోస్టులు, రిజర్వేషన్ల మేరకు కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా సెలక్షన్‌ కమిటీ వాటిని పరిశీలించి ఉద్యోగాలకు అర్హులైన వారి వివరాలతో కూడిన షార్ట్‌లిస్టును శనివారం ఉ.11 గంటలకు వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. జాబితాలో పేరున్న వారికి జిల్లా సెలక్షన్‌ కమిటీ కాల్‌ లెటర్లను అభ్యర్థుల మెయిల్‌కు పంపిస్తారు. షార్ట్‌ లిస్టులో పేరున్న అభ్యర్థులు ఈనెల 21, 22 తేదీల్లో తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్ల స్కాన్డ్‌ కాపీలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి.

మరోవైపు.. ఎంపికైన అభ్యర్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిమిత్తం ప్రతీ జిల్లాలో ఒక కేంద్రాన్ని ఏర్పాటుచేసుకోవాలని జిల్లా పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. 23, 24, 25 తేదీల్లో జరిగే సరిఫ్టికెట్ల వెరిఫికేషన్‌లో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొంటారు. ఇందులో అన్ని ధృవీకరణ పత్రాలు చూపించిన అభ్యర్థులకు ఆ రోజు సాయంత్రానికి అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇచ్చే బాధ్యతను జిల్లా సెలక్షన్‌ కమిటీలకే అప్పగించారు. ఇవి అందుకున్న అభ్యర్థులు అక్టోబర్‌ 1, 2 తేదీల్లో జరిగే శిక్షణ కార్యక్రమానికి హాజరై, రెండో తేదీనే విధుల్లో చేరాలి. (చదవండి: ఫలితాల్లోనూ రికార్డ్‌)

>
మరిన్ని వార్తలు