నేటి నుంచి ఏపీ గ్రూప్-2 దరఖాస్తులు

11 Nov, 2016 07:56 IST|Sakshi
నేటి నుంచి ఏపీ గ్రూప్-2 దరఖాస్తులు

డిసెంబర్ పది వరకు స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) నిర్వహించనున్న గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ శుక్రవారం నుంచి ప్రారంభమవనుంది. కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.పీఎస్‌సీ.ఏపీ.జీఓవీ.ఐఎన్’లో ఆన్‌లైన్ దరఖాస్తును పొందుపర్చనున్నారు. దరఖాస్తులను శుక్రవారం నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు సమర్పించవచ్చు. ఇందుకు సంబంధించిన ఫీజును డిసెంబర్ 10వ తేదీ రాత్రి 11:59 నిమిషాల వరకు చెల్లించే వీలుంది.

దరఖాస్తులకు సంబంధించిన సమాచారమంతటినీ సమగ్రంగా ముందే ఒన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్‌‌టట్రేషన్లో నమోదు చేసుకుని అనంతరం దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. రిజర్వేషన్లకు సంబంధించి బీసీలకు క్రీమిలేయర్, నాన్ క్రీమిలేయర్ నిబంధనలు వర్తించనున్నాయి. బీసీ అభ్యర్థులు తమ తల్లిదండ్రుల సంవత్సరాదాయం రూ.6లక్షల లోపుంటే నాన్‌క్రీమిలేయర్ పరిధిలోకి రానున్నారు. తహసీల్దార్ జారీచేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని నిర్దేశిత సమయంలో సమర్పించనివారి అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తారు.
 
అభ్యర్థులు సమర్పించాల్సిన ధ్రువపత్రాలివే..

♦  కులం, నివాస, పుట్టిన తేదీ ధ్రువపత్రాల ప్రొఫార్మా
♦  డిక్లరేషన్ ఆఫ్ ది అన్‌ఎంప్లాయిడ్
♦  స్కూల్ స్టడీ సర్టిఫికెట్
♦  స్థానిక ధ్రువపత్రం
♦  అంధులైతే మెడికల్ సర్టిఫికెట్
♦ చెవిటి, మూగ అభ్యర్థులైతే సంబంధిత మెడికల్ సర్టిఫికెట్లు
♦ అంగవైకల్యం కలవారైతే అందుకు సంబంధించిన ధ్రువపత్రాలు
♦  బీసీ అభ్యర్థులు క్రీమిలేయర్ సర్టిఫికెట్
♦ లోకల్ స్టేటస్ సర్టిఫికెట్

ఆ నాలుగు పోస్టులకు ప్రొఫిషియన్సీ టెస్టు లేదు
ఏపీపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్లో కొన్ని పోస్టులకు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని తప్పనిసరి చేసింది. ఆయా పోస్టుల వివరాల్ని అందులో పొందుపరిచింది. అయితే ఆ జాబితాలో కొన్ని ఇతర పోస్టులు పొరపాటున చేరాయి. పోస్టు కోడ్ నంబర్ 8, 13, 33, 34 పోస్టులకు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం లేదని, వాటిని ప్రొఫిషియన్సీ టెస్టునుంచి మినహాయిస్తున్నామని కమిషన్ గురువారం ఒక సవరణ ప్రకటన జారీచేసింది. పోస్టు కోడ్ నంబర్లు 9, 10, 11, 12, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32 పోస్టులకు ప్రొఫిషియన్సీ పరీక్ష నిర్వహిస్తారు.

మరిన్ని వార్తలు