కరోనా : అత్యధిక పరీక్షలు చేస్తున్న రాష్ట్రం ఏపీనే

25 Apr, 2020 19:52 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : దేశంలో అత్యధిక కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని హెల్త్‌ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌రెడ్డి అన్నారు. ప్రతి 10 లక్షల మందిలో 1,147 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు చేసిన పరీక్షల్లో 60,250 మందికి నెగెటివ్‌ వచ్చిందన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ రేటు తక్కువగా ఉందన్నారు. ఈ రోజు కొత్తగా వచ్చిన 61 కేసుల్లో 52 కేసులు పాత క్లస్టర్ల నుంచే వచ్చాయని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో 3 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.
(చదవండి : ఏపీలో కొత్తగా 61 కరోనా పాజిటివ్‌ కేసులు)

ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని 171 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపారు. బాడీలో శాచ్యూరేషన్‌ లెవల్‌ తగ్గడంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఎప్పటికప్పుడు ఆక్సిజన్ శాచ్యూరేషన్‌ లెవెల్ ను పరీక్ష చేసి తక్షణమే అందించాలని కోవిడ్ ఆస్పత్రులకు సూచనలు చేశామని చెప్పారు. దీని కోసం 1174 మంది వైద్య నిపుణులను నియమించినట్లు తెలిపారు. కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాలకు డాక్టర్లను పంపి అక్కడ పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టామన్నారు. లాక్‌డౌన్‌ వేళ డయాలసిస్‌ రోగులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 718 మంది డయాలసిస్‌ రోగులు ఉన్నారని, వారందరిని దగ్గరలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులకు తరలించామని చెప్పారు. రెడ్‌జోన్‌, కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో ఉన్నవారు శ్వాస అందక ఇబ్బుందులు పడితే తక్షణమే 104కు ఫోన్‌ చేయాలని సూచించారు. 

>
మరిన్ని వార్తలు