సంతృప్తికరం

18 Mar, 2020 03:24 IST|Sakshi

కోవిడ్‌పై ఏపీ సర్కారు చర్యల మీద హైకోర్టు విచారణ వచ్చే వారానికి వాయిదా

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ (కోవిడ్‌–19) వ్యాప్తి నిరోధానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంతృప్తికరమైన చర్యలే తీసుకుంటోందని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వం తీసుకునే చర్యలకు సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందంది. ప్రభుత్వం తన చర్యలను ఇలాగే కొనసాగించాలని స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే విషయంలో ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని ఆదేశించింది.

న్యాయస్థానాల్లో కూడా కరోనా వైరస్‌ వ్యాప్తి కాకుండా తగిన చర్యలు చేపట్టామని పేర్కొంది. ఈ కేసుపై మరోసారి విచారణ జరుపుతామని తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. కరోనా వైరస్‌ విషయంలో పూర్తిస్థాయిలో ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది ఎన్‌.జనార్దనరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేయగా.. సీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు