ధరల సమీక్షాధికారం ఈఆర్‌సీకి ఉంది

25 Sep, 2019 03:53 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన హైకోర్టు

పీపీఏ నిబంధనలను మార్చే..సవరించే అధికారం కూడా ఈఆర్‌సీకి ఉంది

డిస్కమ్‌ల పిటిషన్‌లో జోక్యం చేసుకోలేం.. అభ్యంతరాలన్నీ ఈఆర్‌సీ ముందు లేవనెత్తండి

పవన, సౌర విద్యుత్‌ కంపెనీలకు హైకోర్టు సూచన 

సాక్షి, అమరావతి: విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందాలను (పీపీఏ) పునఃసమీక్షించే అధికారం ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ)కి ఉందన్న ప్రభుత్వ వాదనతో మంగళవారం హైకోర్టు ఏకీభవించింది. పవన, సౌర విద్యుత్‌ ధరలు ఎక్కువగా ఉన్నందున, వాటిని పునఃసమీక్షించాలని కోరుతూ విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించాలన్న ఈఆర్‌సీ నిర్ణయాన్ని రద్దు చేసేందుకు నిరాకరించింది. ధరల పునఃసమీక్ష కోసం ఈఆర్‌సీ ముందు డిస్కమ్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. 41 పీపీఏల విషయంలో వాటి నిబంధనలను నియంత్రించే, మార్చే, సవరించే అధికారం ఈఆర్‌సీకి ఉందంది. ఈఆర్‌సీలో అనుభవజ్ఞుడైన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, సాంకేతిక విషయాల్లో నైపుణ్యం ఉన్న వ్యక్తులు సభ్యులుగా ఉంటారు కాబట్టి పవన, సౌర విద్యుత్‌ కంపెనీలు వారి అభ్యంతరాలను ఈఆర్‌సీ ముందు లేవనెత్తవచ్చునని తెలిపింది.

విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీలు లేవనెత్తే అభ్యంతరాలన్నింటిపై స్వతంత్ర విచారణ జరపాలని ఈఆర్‌సీకి తేల్చిచెప్పింది. ప్రభుత్వం నుంచి భారీ బకాయిలు రావాల్సి ఉందన్న ఆరోపణలు ఉండటం, అలాగే పవన, సౌర విద్యుత్‌ ధరలు ఎక్కువగా ఉన్నాయని, డిస్కమ్‌లు భారీ నష్టాల్లో ఉన్నాయని, ప్రస్తుతం ఉన్న ధరలు కొనసాగితే భారీ నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారాన్ని ఆరు నెలల్లో తేల్చాలని ఈఆర్‌సీకి స్పష్టం చేసింది. పవన, సౌర విద్యుత్‌ కొనుగోలు ధరలు అధికంగా ఉన్నాయని, వాటిని పునః సమీక్షించాలని కోరుతూ డిస్కమ్‌లు ఏపీఈఆర్‌సీలో పిటిషన్‌ దాఖలు చేశాయి. ఇప్పటికే ఈఆర్‌సీ ధరలను నిర్ణయించినందున, మరోసారి ఆ ప్రక్రియను చేపట్టడానికి వీల్లేదంటూ డిస్కమ్‌ల పిటిషన్‌పై కొన్ని పవన, సౌర విద్యుత్‌ కంపెనీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటితోపాటు వివిధ అంశాల్లో మరికొన్ని పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలన్నింటిపై ఇటీవల తుది విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు మంగళవారం తన తీర్పును వెలువరించారు. 

ప్రభుత్వ ధరల ప్రకారమే చెల్లింపులు..
‘పవన, సౌర విద్యుత్‌ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని.. పవన విద్యుత్‌కు యూనిట్‌కు రూ.2.43, సౌర విద్యుత్‌కు రూ.2.44 చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే.. ప్రభుత్వం ఇస్తున్న వివిధ రకాల సబ్సిడీల వల్ల పంపిణీ సంస్థలకు నష్టం వస్తుందే తప్ప, విద్యుత్‌ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కాదని విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరుపక్షాల హక్కులను పరిగణనలోకి తీసుకున్నాక యూనిట్‌కు రూ.2.43, రూ.2.44 ధరలకే పవన, సౌర విద్యుత్‌ బిల్లులు చెల్లించాలని డిస్కమ్‌లను ఆదేశిస్తున్నాం. ప్రస్తుత బకాయిలను, భవిష్యత్తు చెల్లింపులను కూడా ఈ మధ్యంతర రేట్ల ప్రకారమే చేయాలి.

ఏపీఈఆర్‌సీ ఈ వ్యవహారాన్ని తేల్చే వరకు ఈ రేట్ల ప్రకారమే చెల్లింపులు చేయాలి’ అని హైకోర్టు తెలిపింది. పీపీఏల సమీక్షకు ఉన్నత స్థాయి సంప్రదింపుల కమిటీ (హెచ్‌ఎల్‌ఎస్‌సీ)ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 63ను రద్దు చేసింది. అలాగే పవన, సౌర విద్యుత్‌ ధరల తగ్గింపునకు హెచ్‌ఎల్‌ఎస్‌సీతో సంప్రదింపులు జరపాలని విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీలను ఆదేశిస్తూ ఎస్‌పీడీసీఎల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ రాసిన లేఖలను సైతం రద్దు చేసింది. రాష్ట్ర గ్రిడ్‌తో అనుసంధానించిన విద్యుత్‌ సరఫరా కనెక్షన్‌లను తొలగించిన నేపథ్యంలో, ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించేందుకు నిపుణులతో అధ్యయన కమిటీ ఏర్పాటు చేయాలన్న అభ్యర్థనతో పవన, సౌర విద్యుత్‌ కంపెనీలు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టేసింది. 

మరిన్ని వార్తలు