ప్రతివాదులకు నోటీసులివ్వం 

13 Feb, 2020 04:20 IST|Sakshi

రాజధాని తరలింపు వ్యవహారంలో పిటిషనర్లకు తేల్చిచెప్పిన హైకోర్టు ధర్మాసనం 

సాక్షి, అమరావతి:  రాజధాని తరలింపు వ్యవహారంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పలువురు మంత్రులు, సలహాదారులను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. వారెవ్వరికీ తాము ఎలాంటి నోటీసులు జారీ చేయబోమని, విచారణకు ఆదేశించబోమని తేల్చిచెప్పింది. రాజకీయ వ్యాఖ్యలకు దురుద్దేశాలు అంటగట్టి, వాటిపై విచారణ జరపాలని కోరడం వెనుక ఔచిత్యం ఏమిటని పిటిషనర్‌ను నిలదీసింది. పిటిషనర్‌ అనవసర విషయాలపై ఎక్కువ దృష్టి సారించారని వ్యాఖ్యానించింది. తమకు అసలు విషయాలే కావాలని పేర్కొంది.  

సమాధానం సంతృప్తికరంగా ఉంటే..  
విజిలెన్స్‌ కమిషన్, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ కార్యాలయాల ప్రస్తుత విస్తీర్ణం ఎంత? వాస్తవానికి ఎంత విస్తీర్ణం అవసరం? ఈ రెండు కార్యాలయాల్లో ఎంతమంది పనిచేస్తున్నారు? ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి? తదితర వివరాలతో లిఖితపూర్వకంగా అఫిడవిట్‌ను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారితో కౌంటర్‌ దాఖలు చేయించాలని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ సమాధానం సంతృప్తికరంగా ఉంటే కార్యాలయాల తరలింపు విషయంలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయబోమని తెలిపింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.  అభివృద్ధి–పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులను సవాలు చేస్తూ హైకోర్టులో పలు పిల్స్‌ దాఖలైన విషయం తెలిసిందే. అలాగే విజిలెన్స్‌ కమిషన్, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ కార్యాలయాలను కర్నూలుకు తరలించే నిమిత్తం ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 13ను, విశాఖలో మిలీనియం టవర్స్‌–బి నిర్మాణ పనుల నిమిత్తం రూ.19.73 కోట్లు కేటాయిస్తూ జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిపై బుధవారం సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.

ఇంప్లీడ్‌ పిటిషనర్ల వాదనలు వింటాం.. 
అధికారులు సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారని భావిస్తే, సంబంధిత ఫోరం ముందు ఫిర్యాదు చేసుకోవాలని పిటిషనర్‌కు హైకోర్టు ధర్మాసనం సూచించింది. ఈ దశలో న్యాయవాది యర్రంరెడ్డి నాగిరెడ్డి జోక్యం చేసుకుంటూ... రాయలసీమ ప్రాంత ప్రజలు అభివృద్ధి వికేంద్రీకరణ కోరుకుంటున్నారని, వారు ఈ వ్యాజ్యంలో ఇంప్లీడ్‌ అయి వాదనలు వినిపించాలని భావిస్తున్నారని తెలిపారు. ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశామని చెప్పారు. తగిన సమయంలో ఇంప్లీడ్‌ పిటిషనర్ల వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.   

మరిన్ని వార్తలు