ఆ జీవో ఇవ్వడంలో తప్పేముంది?

28 Nov, 2019 05:10 IST|Sakshi

స్టే కుదరదు.. జీవో 2430పై హైకోర్టు స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: ప్రభుత్వంపై తప్పుడు, నిరాధార వార్తలు ప్రచురించిన, ప్రసారం చేసిన సంస్థలపై న్యాయపరమైన చర్యలు తీసుకునే పూర్తి అధికారాన్ని ఆయా శాఖలకు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 2430 అమలును నిలిపేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ వాదనలు వినకుండా ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ప్రభుత్వం ఈ జీవో జారీ చేయడంలో తప్పేముందని, మీకొచ్చిన నష్టం ఏముందని పిటిషనర్‌ను ప్రశ్నించింది. అయితే.. ప్రస్తుత జీవోలో గతంలో రద్దయిన జీవో గురించి ఎందుకు ప్రస్తావించారో స్పష్టతనివ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇందుకు సంబంధించిన వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలంది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. సాధారణ పరిపాలన శాఖ (డీఏడీ) కార్యదర్శి గత నెల 30న జారీ చేసిన జీవో 2430 రాజ్యాంగ విరుద్ధమని, అందువల్ల దీనిని రద్దు చేయాలని కోరుతూ ఉప్పల లక్ష్మణ్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు