‘వికేంద్రీకరణ’పై కౌంటర్లు దాఖలు చేయండి

27 Feb, 2020 05:06 IST|Sakshi

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం

రాజధానిలో ‘పేదలందరికీ ఇళ్లు’ పథకానికి 1,250 ఎకరాల కేటాయింపుపై పిటిషన్లు

నేడు కొనసాగనున్న వాదనలు  

సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనుల కొనసాగింపు, హైకోర్టు తరలింపు వ్యవహారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు బుధవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 17కి వాయిదా వేసింది. అలాగే పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులను, జీఎన్‌ రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ (బీసీజీ), హైపవర్‌ కమిటీల నివేదికలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో కూడా కౌంటర్లు దాఖలు చేయాలని సూచించింది. ఈ వ్యాజ్యాలపై విచారణను మార్చి 30కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని వ్యవహారంలో రకరకాల వ్యాజ్యాలు దాఖలై, గందరగోళంగా ఉన్న నేపథ్యంలో అంశాల వారీగా ఆ వ్యాజ్యాలను వేరు చేయాలని రిజిస్ట్రీకి ధర్మాసనం సూచించింది.

రాజకీయ ఆరోపణలు చేయొద్దు..
పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన సీనియర్‌ న్యాయవాది దేవదత్‌ కామత్‌ వాదనలు వినిపిస్తూ, రాజధాని ప్రాంతంలో నిలిపేసిన పనులన్నింటినీ కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. అమరావతి నుంచి హైకోర్టును తరలించే వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది కాదని, అది కేంద్ర పరిధిలోనిదని కోర్టుకు నివేదించారు. అనంతరం పిటిషనర్ల తరఫున మరికొందరు న్యాయవాదులు వాదనలు వినిపించబోతుండగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, రాజకీయ ఆరోపణలు చేయవద్దని స్పష్టం చేసింది. కేవలం న్యాయపరమైన అంశాలకే పరిమితం కావాలని గట్టిగా చెప్పింది. సీనియర్‌ న్యాయవాది అశోక్‌ భాన్‌ వాదనలు వినిపిస్తూ.. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే హైపవర్‌ కమిటీ నివేదిక ఇచ్చిందని వివరించారు. ఈ విచారణ సందర్భంగా కోర్టులో ఏ న్యాయవాది ఏ అంశంపై వాదనలు వినిపిస్తున్నారో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో అంశాల వారీగా వ్యాజ్యాలను విభజించి విచారణ జరపాలని ధర్మాసనం నిర్ణయించింది. ఈ మొత్తం వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను వాయిదా వేసింది. 

1250 ఎకరాల కేటాయింపుపై పిటిషన్లు...
ఇదిలా ఉంటే, రాజధాని ప్రాంతంలో 1,250 ఎకరాలను పేదలందరికీ ఇళ్ల పథకం కోసం కేటాయిస్తూ ప్రభుత్వం ఈ నెల 25న జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై త్రిసభ్య ధర్మాసనం బుధవారం మధ్యాహ్నం నుంచి విచారణ ప్రారంభించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలు ముగియడంతో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదనలు ప్రారంభించారు. కోర్టు పనివేళలు ముగియడంతో ధర్మాసనం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. 

>
మరిన్ని వార్తలు