సానుకూల కోణంలో చూడాలి

23 May, 2020 06:05 IST|Sakshi

వలస కార్మికుల విషయంలో హైకోర్టు

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను సానుకూల కోణంలో చూడాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా సమన్వయ లోపం వల్ల అవి ఫలవంతం కావడం లేదంది. అందువల్ల అధికారుల మధ్య సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది. వలస కార్మికుల విషయంలో ప్రభుత్వానికి శుక్రవారం పలు ఆదేశాలిచ్చింది. 

► కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లోని జాతీయ రహదారుల వెంబడి ఉన్న టోల్‌ప్లాజాల వద్ద వలస కార్మికుల కోసం తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేయాలి. తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలి. 
► రెవెన్యూ, పోలీసుల, వైద్య శాఖల నుంచి ఒక్కో ఉద్యోగి, గ్రామ వలంటీర్, రెడ్‌క్రాస్‌ కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు, పారా లీగల్‌ వలంటీర్లతో ఓ సమన్వయ బృందాన్ని ఏర్పాటు చేయాలి. ఈ బృందం వలస కార్మికులు ఎక్కడికి వెళ్లాలో తెలుసుకుని తగిన ఏర్పాట్లు చేయాలి. మంగళగిరిలో ఉన్న అక్రక్స్‌ ఐటీ సాయంతో వలస కార్మికుల వివరాలు నమోదు చేసుకుని, 8 గంటల్లో వారిని స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేయాలి. 
► వలస కార్మికులను తరలించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు బస్సులను వినియోగించాలి. ఈ విషయంలో రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లు జిల్లా స్థాయిల్లో సమన్వయ బాధ్యతలు తీసుకోవాలి. 
► తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ఆగిపోయిన వలస కార్మికులకు తగిన ఆహారం, వసతి, ఆర్థిక సాయం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పిల్‌ దాఖలు చేయడం తెలిసిందే.      

మరిన్ని వార్తలు