టీడీపీ కుటిలయత్నాలు హైకోర్టు సాక్షిగా బట్టబయలు

8 Jul, 2020 04:17 IST|Sakshi

తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుని వారికి తెలియకుండానే పిటిషన్‌ 

పిటిషనర్లలో ఇద్దరు తహసీల్దార్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు 

వాటిని హైకోర్టు ముందుంచిన అదనపు ఏజీ పొన్నవోలు 

22,500 పట్టాల మంజూరుపై స్టేకు హైకోర్టు నిరాకరణ 

కౌంటర్‌ దాఖలుకు ఆదేశం.. విచారణ 21కి వాయిదా 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పేదలందరికీ ఇళ్ల పట్టాల మంజూరు పథకాన్ని అడ్డుకునేందుకు టీడీపీ  చేస్తూ వస్తున్న కుటిల ప్రయత్నాలు మంగళవారం హైకోర్టు సాక్షిగా బట్టబయలయ్యాయి. గ్రామ సమస్య పరిష్కారం కోసం వినతిపత్రం ఇద్దామంటూ మభ్యపెట్టి గ్రామస్తుల నుంచి తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుని, వారికి తెలియకుండా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన టీడీపీ నాయకుల బండారం హైకోర్టులో మంగళవారం బయటపడింది. అదనపు అడ్వకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి టీడీపీ నాయకుల తీరును ఆధారాలతో సహా కోర్టు ముందుంచారు. వివరాలు ఇలా ఉన్నాయి... 

► పేదలందరికీ ఇళ్ల పట్టాల మంజూరు పథకంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన బల్లి ప్రభాకరరావు, జాజుల హరికృష్ణ.. టీడీపీ నాయకులు తమను ఎలా మభ్యపెట్టారో తహసీల్దార్‌కు లిఖితపూర్వకంగా వివరించారు.  
► వారి గ్రామమైన యర్రజర్లలో కాల్వ సమస్య అంటూ అదే గ్రామానికి చెందిన గండపునేని శ్రీనివాసులు (టీడీపీ నాయకుడు) వారి వద్దకు వచ్చి ఆధార్‌కార్డు జిరాక్స్‌ కాపీ, తెల్ల కాగితంపై సంతకం తీసుకున్నారు. అంతకు మించి ఏమీ తెలియదని ప్రభాకరరావు, హరికృష్ణ చెప్పారు. 
► పిటిషన్‌ వేసిన వారిలో మా పేర్లు ఉన్నాయని తెలిసిందని, వాస్తవాలు వివరించేందుకు తహసీల్దార్‌ వద్దకు వచ్చామన్నారు. వారు చెప్పిన వివరాలను వీఆర్‌ఓ సమక్షంలో రికార్డ్‌ చేసిన తహసీల్దార్‌ అదనపు ఏజీకి అందజేశారు. 
► ఈ వివరాలను అదనపు ఏజీ పొన్నవోలు మంగళవారం హైకోర్టు ముందుంచారు. 

మైనింగ్‌ భూమి ఇవ్వరాదంటూ పశువుల కాపర్ల పిటిషన్‌.. 
► ఇళ్ల స్థలాల కోసం ఇస్తున్న భూమిలో తాము పశువులను మేపుకుంటున్నామని, ఆ భూములను ఇళ్ల స్థలాలకు ఇచ్చేస్తే తమకు ఇబ్బందంటూ ప్రకాశం జిల్లా, సర్వేరెడ్డిపాళెం, యర్రజెర్ల, కందుకూరు, మర్లపాడు, కొనిజేడు గ్రామాలకు చెందిన మంకెన తిరుపతిస్వామి, బల్లి ప్రభాకరరావు, జాజుల హరికృష్ణ మరో  17 మంది హైకోర్టులో పిటిషన్‌ వేశారు. 
► ఈ వ్యాజ్యంపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.గంగారావు విచారించారు.  
► పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటున్న భూమిని మైనింగ్‌ కోసం ఏపీఎండీసీకి ఇచ్చారని,  ఏపీఎండీసీ ఆ లీజును మరొకరికి ఇచ్చిందన్నారు. మైనింగ్‌ కోసం ఇచ్చిన భూమిని ఇళ్ల స్థలాలకు ఇవ్వడం సరికాదన్నారు.  

కొన్ని పార్టీల కుట్రలు... 
► ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పి.సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వం తలంచింది. దీన్ని కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుకుంటున్నాయి. ఒంగోలు మండల పరిధిలో ఇవ్వాలనుకుంటున్న 22,500 ఇళ్ల పట్టాల మంజూరుకు అడ్డంకులు సృష్టిస్తున్నాయి’ అని అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...   
► ఇళ్ల స్థలాలకు మైనింగ్‌ భూమి ఇవ్వడం వల్ల ఇబ్బంది ఉంటే లీజు పొందిన వారికి ఉండాలి తప్ప, పిటిషనర్లకు కాదు. పశువుల కాపర్లమని చెప్పుకుంటున్న వారికి మైనింగ్‌ లీజుతో ఏం పని? వాస్తవానికి పిటిషనర్లకు ఈ వ్యాజ్యం గురించి తెలియదు. రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు దీనికి వెనుక ఉన్నారు.  
► పిటిషనర్లలో బల్లి ప్రభాకరరావు, జాజుల హరికృష్ణ స్వయంగా రాసి ఇచ్చిన ఫిర్యాదు ఉంది. తమకూ ఈ పిటిషన్‌కు సంబంధం లేదని, తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుని ఈ వ్యాజ్యం వేశారని వారు లిఖితపూర్వంగా చెప్పారు. 
► ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, 22,500 పట్టాల మంజూరుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించారు. కౌంటర్ల దాఖలు చేయాలంటూ విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు.

మరిన్ని వార్తలు