ఐదుగురు రైతులకు హైకోర్టు జరిమానా 

27 Nov, 2019 05:28 IST|Sakshi

ఒక్కొక్కరు రూ.లక్ష చొప్పున చెల్లించాలని ఆదేశం 

‘పిల్‌’ను దుర్వినియోగం చేశారన్న న్యాయస్థానం 

సాక్షి, అమరావతి:  ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్‌) దుర్వినియోగం చేయడమే కాకుండా న్యాయస్థానం ముందు వాస్తవాలను దాచి పెట్టినందుకు కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు రైతులకు హైకోర్టు భారీ జరిమానా విధించింది. ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని రెండు వారాల్లో చెల్లించాలని ఆదేశించింది. వారు ఆ మొత్తాన్ని చెల్లించకపోతే రెండు నెలల్లో ఆ డబ్బును రెవెన్యూ రికవరీ చట్ట నిబంధనల మేరకు రికవరీ చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. తాము చిన్న రైతులమని, అంత జరిమానా చెల్లించలేమని ఆ రైతులు వేడుకున్నా హైకోర్టు అంగీకరించలేదు. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఏమిటీ కేసు...  
కర్నూలు జిల్లా అవుకు మండలం సంగపట్నం గ్రామ పరిధిలో ప్రమీల అనే మహిళ మైనింగ్‌ లీజు పొందారు. తరువాత మైనింగ్‌ కోసం ఇచ్చిన నిరభ్యంతర పత్రాన్ని స్థానిక తహసీల్దార్‌ ఉపసంహరించుకున్నారు. దీంతో ప్రమీల మైనింగ్‌ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీనిపై ఆమె హైకోర్టులో పిటిషన్‌ వేసి, సానుకూల ఉత్తర్వులు పొందారు. ప్రమీల పొందిన సానుకూల ఉత్తర్వులను దాచిపెట్టి, అదే మైనింగ్‌ లీజుపై కొలిమిగుండ్ల మండలం బెలుం శింగవరం గ్రామానికి చెందిన ఎం.రమణారెడ్డి, మరో ఐదుగురు రైతులు 2011లో హైకోర్టులో ‘పిల్‌’ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, మైనింగ్‌ లీజుపై స్టే ఇచ్చింది.  

న్యాయవాదినే బెదిరిస్తారా?  
పలు వాయిదాల అనంతరం ఇటీవల ఈ వ్యాజ్యం సీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. రమణారెడ్డి తదితరుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ వ్యాజ్యంలో ఇకపై వాదనలు వినిపించవద్దని రమణారెడ్డి తదితరులు లేఖ రాశారంటూ ఆ లేఖను ధర్మాసనం ముందుంచారు. ఆ లేఖను పరిశీలించిన ధర్మాసనం, రమణారెడ్డి తదితరులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాదనలు వినిపిస్తే బార్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తామని న్యాయవాదిని బెదిరిస్తారా? అంటూ మండిపడింది.

మంగళవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా, రమణారెడ్డి తదితరులను పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. ధర్మాసనం ఈ కేసు రికార్డులను పరిశీలించింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఓ ఎమ్మెల్యే ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేసింది. న్యాయవాదిని బెదిరిస్తూ లేఖ రాయడం, కోర్టు ముందు వాస్తవాలు దాచిపెట్టిడం ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దుర్వినియోగం చేయడమేనని తేల్చి చెప్పింది. ఆరుగురు పిటిషనర్లలో ఒకరు చనిపోవడంతో మిగిలిన ఐదుగురికి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తున్నట్లు స్పష్టం చేసింది.     

మరిన్ని వార్తలు