ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

25 Sep, 2014 23:40 IST|Sakshi
ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

సాక్షి, కర్నూలు: ఎట్టకేలకు ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఉప ఎన్నిక నిర్వహించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి ఈ నెల మొదటివారంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం చట్టప్రకారం ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంటూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు మార్గం సుగమమైంది.

ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీకి దిగిన భూమా శోభా నాగిరెడ్డి ఏప్రిల్ 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పటికే ఈవీఎంలలో శోభా నాగిరెడ్డి పేరు చేర్చి ఉన్నందున, పోటీ నుంచి ఆమె పేరును తొలగించడం సాధ్యం కాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అత్యధిక ఓట్లు వస్తే శోభా నాగిరెడ్డి గెలిచినట్లు ప్రకటించి, ఆ తరువాత ఉప ఎన్నిక నిర్వహిస్తామని కూడా ప్రకటించింది. అయితే అభ్యర్థి శోభా నాగిరెడ్డి మరణించినందున ఆమెకు అత్యధిక ఓట్లు వచ్చినా ఆమె ఎన్నిక చెల్లదని, రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థిని గెలిచినట్లు ప్రకటించాలని రుద్రవరం మండలం చిన్నకంబలూరు గ్రామానికి చెందిన జంగా వినోద్‌కుమార్‌రెడ్డి, యర్రగుడిదిన్నె గ్రామానికి చెందిన హర్షవర్ధన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

వీరి పిటిషన్లపై ఇంకా విచారణ కొనసాగుతోంది. ఈలోగా, కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 16న ఉప ఎన్నిక షెడ్యూలును విడుదల చేసింది. కొన్ని సాంకేతిక కారణాలు చూపుతూ ఆళ్లగడ్డ స్థానాన్ని నాటి షెడ్యూలులో చేర్చలేదు. అళ్లగడ్డ ఉప ఎన్నికపై ఎన్నికల సంఘం అలసత్వం ప్రదర్శిస్తోందని, ఇది ప్రజాప్రాతినిధ్య చట్టానికి విరుద్ధమని భూమా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఉప ఎన్నిక నిర్వహించాలంటూ హైకోర్టు  ఉత్తర్వులు ఇవ్వడంతో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు