వివేకా హత్యకేసు : సిట్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు..!

26 Mar, 2019 13:55 IST|Sakshi

సాక్షి, అమరావతి : మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్లను మంగళవారం ఏపీ హైకోర్టు విచారించింది. ఈ కేసు దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్యకేసులో నిష్పక్షపాత దర్యాప్తును కోరుతూ ఏపీ హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. సిట్‌ విచారణపై నమ్మకం లేదని థర్డ్‌పార్టీ సంస్థతో విచారణ చేయించాలని పిటిషన్‌దారుల తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఎన్నికల ముందు సిట్‌ దర్యాప్తు పేరిట మీడియా సమావేశాలు నిర్వహించి వైఎస్‌ కుటుంబ సభ్యులను బద్నాం చేయాలని చూస్తున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఎన్నికలు ముగిసే వరకు సిట్‌ ఎలాంటి ప్రెస్‌మీట్‌ పెట్టకుండా నిరోధించాలని కోర్టుకు విన్నవించారు. ఆయన వాదనతో ఏకీభవించిన హైకోర్టు ఎన్నికలు ముగిసేవరకు సిట్‌ మీడియా సమావేశాలు నిర్వహించొద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే, కేసు విచారణ జరుపుకోవచ్చని తెలిపింది. తదుపరి విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, వైఎస్‌ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ, రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అనిల్‌ ఈ పిటిషన్లను దాఖలు చేశారు.

చదవండి : వివేకా హత్యకేసుపై సౌభాగ్యమ్మ పిటిషన్‌..!

మరిన్ని వార్తలు