కార్యాలయాలను తరలించొద్దని సీఆర్‌డీఏ చట్టంలో ఎక్కడుంది?

6 Feb, 2020 06:32 IST|Sakshi

అర్థంపర్థం లేని వాదనలతో మా సమయాన్ని వృథా చేయవద్దు

నిరాధార ఆరోపణలు చేసి మౌనంగా నిల్చుంటే సరిపోదు

పిటిషనర్ల న్యాయవాదులపై హైకోర్టు అసహనం

తరలింపు కారణాలు తెలుసుకోవాలనుకుంటున్నాం

నోట్‌ ఫైళ్లు, ప్రొసీడింగ్స్‌తో అఫిడవిట్‌ వేయండి

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం.. విచారణ 11కి వాయిదా  

సాక్షి, అమరావతి: అమరావతి నుంచి మరో చోటుకి ప్రభుత్వ కార్యాలయాలను తరలించరాదని సీఆర్‌డీఏ చట్టంలో ఎక్కడ ఉందో చూపాలని పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది. కార్యాలయాల తరలింపు వెనుక దురుద్దేశాలున్నాయని చెబితే సరిపోదని, ఎవరికి ఆ దురుద్దేశాలున్నాయో స్పష్టంగా చెప్పాలంది. అర్థం పర్థం లేని వాదనలతో కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు తేల్చి చెప్పింది. నిరాధార ఆరోపణలతో కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలు చేసి, తమ ముందు నిల్చుంటే సరిపోదని, తరలింపు విషయంలో ప్రభుత్వానికి చట్టాలు ఎక్కడ అడ్డుపడుతున్నాయో కూడా చెప్పాలని స్పష్టం చేసింది.

పరిపాలనాపరమైన సౌలభ్యం కోసమే విజిలెన్స్‌ కమిషనర్, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తున్నారని చెబుతున్న నేపథ్యంలో, ఆ సౌలభ్యం ఏమిటో స్పష్టంగా చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆ రెండు కార్యాలయాల తరలింపు జీవోలో కేవలం పాలనాపరమైన కారణాలు అని మాత్రమే పేర్కొన్నారని, ఈ నేపథ్యంలో తరలింపు కారణాలు ఏమిటో స్పష్టంగా తెలుసుకోవాలని అనుకుంటున్నామని ధర్మాసనం పేర్కొంది. అన్ని వివరాలతో మూడు రోజుల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని, సంబంధిత నోట్‌ ఫైళ్లు, ప్రొసీడింగ్స్‌ను కూడా జత చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఉపన్యాసాలొద్దు.. విషయానికి రండి...
విజిలెన్స్‌ కమిషనర్, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌ కార్యాలయాలను కర్నూలులో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 13ను సవాలు చేస్తూ గుంటూరు జిల్లా, తాళాయపాళెంకు చెందిన కొండేపాటి గిరిధర్, అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దే తిరుపతిరావు వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై బుధవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన కారుమంచి ఇంద్రనీల్‌ బాబు వాదనలు వినిపిస్తూ.. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని ప్రభుత్వం తన జీవోలో పేర్కొందని, అయితే ఏ అంశాన్నీ పట్టించుకోలేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఈ విషయాలన్నీ మీ పిటిషన్‌లో ఉన్నాయా? అంటూ ప్రశ్నించింది. ఉన్నాయని చెప్పిన ఇంద్రనీల్‌ మళ్లీ వాదనలు కొనసాగించారు.

ఈ కార్యాలయాల తరలింపు, రాజధాని తరలింపు వెనుక దురుద్దేశాలున్నాయన్నారు. కోర్టు జోక్యం చేసుకుంటూ.. ఉపన్యాసాలకు న్యాయస్థానాలు వేదికలు కావని ఘాటుగా వ్యాఖ్యానించింది. దురుద్దేశాలతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తే చాలదని, ఎవరు అలా వ్యవహరిస్తున్నారో వారి పేర్లు చెప్పాలంది. దీంతో ఇంద్రనీల్‌ ఏమీ మాట్లాకుండా కూర్చుండిపోయారు. మరో న్యాయవాది లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. సీఆర్‌డీఏ చట్టం ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలు నోటిఫై అయి ఉన్నాయన్నారు. అలాంటప్పుడు ఈ శాఖలను తరలించాలంటే సీఆర్‌డీఏ అనుమతి తీసుకోవాలని చెప్పారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ శాఖల తరలింపునకు సీఆర్‌డీఏ అనుమతి కావాలని ఆ చట్టంలో ఎక్కడ ఉందని లక్ష్మీనారాయణను ప్రశ్నించింది. అయితే ఇందుకు ఆయన సూటిగా సమాధానం చెప్పకలేకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధారాలు చూపకుండా పిటిషన్లు దాఖలు చేసి మౌనంగా నిల్చుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేసింది. (చదవండి: భావి తరాల బాగుకే వికేంద్రీకరణ)

>
మరిన్ని వార్తలు