కౌంటర్లు దాఖలు చేయండి

23 May, 2020 05:37 IST|Sakshi

ప్రభుత్వానికి, ఎల్‌జీ పాలిమర్స్‌కు హైకోర్టు ఆదేశం 

విచారణ ఈ నెల 28కి వాయిదా 

సాక్షి, అమరావతి: విశాఖపట్నం ఎల్‌జీ పాలిమర్స్‌లో విషవాయువు లీకై ప్రాణనష్టం జరిగిన ఘటనకు సంబంధించి ఆయా కమిటీల నుంచి నివేదికలు రావాల్సి ఉందని రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌ శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. ఈ నివేదికలు అందిన వెంటనే కోర్టు ముందుంచుతామని తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామన్నారు. అంగీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనను హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణించి విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై శుక్రవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎల్‌జీ పాలిమర్స్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. ఎటువంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే పలు కమిటీలు ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిటీల్లో ఏదో ఒక కమిటీకి విచారణ బాధ్యతలు అప్పగించినా అభ్యంతరం లేదన్నారు. ఇప్పటికే తమ డైరెక్టర్లు పాస్‌పోర్టులను అధికారులకు స్వాధీనం చేశారన్నారు. వాదనలు విన్న ధర్మాసనం కౌంటర్లు దాఖలు చేయాలని ఇరుపక్షాలను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

భూముల విక్రయంపై పిల్‌
ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
రాష్ట్రంలో ఖాళీ భూములను వేలం ద్వారా విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. ఈ వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం విక్రయించతలపెట్టిన భూముల్లో గతంలో ప్రైవేటు వ్యక్తులు ప్రజాప్రయోజనార్థం ఇచ్చిన భూములు కూడా ఉన్నాయని, అందువల్ల ఆ భూ విక్రయాలను అడ్డుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త తోట సురేశ్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు.

మరిన్ని వార్తలు