‘అక్వా డెవిల్స్‌’పై విచారణ వాయిదా

27 Sep, 2019 04:55 IST|Sakshi

స్టే ఇవ్వని హైకోర్టు

సీఆర్‌డీఏ నోటీసులకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదని వ్యాఖ్య

సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా అమరావతి కరకట్ట వద్ద బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు నిర్మించిన ఆక్వా డెవిల్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (ఏడీడబ్లు్యఏ) కట్టడాల కూల్చివేతకు సీఆర్డీఏ అధికారులు జారీచేసిన తుది నోటీసులపై రాష్ట్ర హైకోర్టు గురువారం స్టే ఇవ్వలేదు. సదరు నోటీసులకు ఏడీడబ్లు్యఏ ఏమాత్రం సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేదని హైకోర్టు అభిప్రాయపడింది. సంతృప్తికరమైన వివరణలు ఇవ్వకుండా, జోక్యం చేసుకోవాలని హైకోర్టును కోరితే ఎలా అంటూ పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. సీఆర్‌డీఏ జారీచేసిన నోటీసులకు ఇచ్చిన వివరణలను అధ్యయనం చేసి రావాలని పిటిషనర్‌ న్యాయవాదికి న్యాయస్థానం సూచించి తదుపరి విచారణను అక్టోబర్‌ 1కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మి ఉత్తర్వులు జారీచేశారు.

తమకు చెందిన స్విమ్మింగ్‌ ఫూల్, ఇతర నిర్మాణాలను కూల్చివేసే నిమిత్తం సీఆర్‌డీఏ అధికారులు జారీచేసిన తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏడీడబ్లు్యఏ అధ్యక్షుడు కేఎస్‌ రామచంద్రరావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ విజయలక్ష్మి గురువారం విచారణ జరిపారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పంచాయతీ నుంచి అన్ని అనుమతులు తీసుకునే నిర్మాణాలు చేపట్టామన్నారు. తమవి చిన్నచిన్న షెడ్డులు మాత్రమేనని.. ఇవి కృష్ణా నదికి 100 మీటర్ల వెలుపలే ఉన్నాయని వివరించారు. సీఆర్‌డీఏ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఏడీడబ్లు్యఏ ఆర్‌సీసీ నిర్మాణాలు చేపట్టిందన్నారు. స్విమ్మింగ్‌ ఫూల్‌తో సహా ఈ నిర్మాణాలన్నీ 100 మీటర్లలోపే ఉన్నాయని వివరించారు. అందుకు సంబంధించిన ఫొటోలను ఆయన కోర్టు ముందుంచారు.  పిటిషనర్‌ కోర్టులో చెబుతున్న అంశాలేవీ సీఆర్‌డీఏ అధికారులకిచ్చిన వివరణలో లేవన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, సీఆర్‌డీఏ ఉత్తర్వులపై ఎటువంటి స్టే మంజూరు చేయకుండా తదుపరి విచారణను అక్టోబర్‌ 1కి వాయిదా వేశారు.

తుది ఉత్తర్వులివ్వకుండా చర్యలుండవు
కరకట్ట వద్ద తమకున్న నిర్మాణాన్ని కూల్చివేయకుండా సీఆర్‌డీఏను నియంత్రించాలని కోరుతూ పాతూరి సుధారాణి అనే మహిళ కూడా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ వివరణను పరిగణనలోకి తీసుకున్నాకే తుది ఉత్తర్వులు జారీచేస్తామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది జగన్మోహన్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. తుది ఉత్తర్వులివ్వకుండా చర్యలుండవన్న కాసా వాదనను న్యాయమూర్తి జస్టిస్‌ విజయలక్ష్మి నమోదు చేస్తూ సుధారాణి పిటిషన్‌ను పరిష్కరించారు.

>
మరిన్ని వార్తలు