ఎన్నికల కమిషనర్‌ ‘ఆర్డినెన్స్‌’ రద్దు

30 May, 2020 03:55 IST|Sakshi

తదనుగుణ జీఓలు కూడా..

నిమ్మగడ్డ పదవీ కాలాన్ని పునరుద్ధరించండి 

పదవీకాలం ముగిసే వరకు అతన్ని కొనసాగనివ్వండి.. హైకోర్టు ధర్మాసనం తీర్పు 

తీర్పు అమలు నిలిపివేతకు ప్రభుత్వ పిటిషన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలాన్ని, సర్వీసు నిబంధనలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు రద్దుచేసింది. అలాగే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వి. కనగరాజ్‌ను నియమిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను కూడా రద్దుచేసింది. నిమ్మగడ్డ రమేశ్‌ను ఎన్నికల కమిషనర్‌గా పునరుద్ధరిస్తూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. పదవీ కాలం పూర్తయ్యే వరకు రమేశ్‌ను ఎన్నికల కమిషనర్‌గా కొనసాగనివ్వాలని చెప్పింది. ఏపీ పంచాయతీరాజ్‌ చట్టం 1994లోని సెక్షన్‌ 200 ప్రకారం నియమితులైన ఎన్నికల కమిషనర్‌ మున్సిపాల్టీలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల అన్ని ఎన్నికల నిర్వహణ పర్యవేక్షణ, ఓటర్ల జాబితా తయారీపై నియంత్రణ, మార్గదర్శకత్వం చేయజాలరని హైకోర్టు స్పష్టంచేసింది. అలాగే, పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 2 (39), సెక్షన్‌ 2(40), సెక్షన్‌ 200లోని నిబంధనలను ప్రభుత్వం ఓసారి పున:పరిశీలన చేయాలని, వీటి విషయంలో రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది.

ఎన్నికల సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్, తదనుగుణ జీఓలను సవాలుచేస్తూ నిమ్మగడ్డ రమేశ్, కామినేని శ్రీనివాస్, వడ్డే శోభనాద్రీశ్వరరావులతో పాటు మరికొందరు వేర్వేరుగా 13 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం 332 పేజీల తీర్పు వెలువరించింది. ఈ ఆర్డినెన్స్, జీఓలు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగాలేవని పేర్కొంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలం సర్వీసు నిబంధనల్లో భాగం కాదని.. ఆర్డినెన్స్‌ ద్వారా దానిని కుదించే అధికారం ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది. ఆర్డినెన్స్‌ తీసుకొచ్చేంత అత్యవసర పరిస్థితులేవీ లేవని.. ఎన్నికల కమిషనర్‌ తొలగింపు ప్రక్రియను రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిందని హైకోర్టు గుర్తుచేసింది.

ఆర్డినెన్స్‌ జారీచేసే అధికారం గవర్నర్‌కు ఉందని.. అయితే, ప్రస్తుత కేసులో జారీచేసిన ఆర్డినెన్స్‌ మాత్రం రాజ్యాంగానికి అనుగుణంగా లేదని ధర్మాసనం పేర్కొంది. సర్వీసు నిబంధనలు పదవీ కాలాన్ని నిర్ణయించే అధికారం మాత్రమే ప్రభుత్వానికి ఉందని హైకోర్టు స్పష్టంచేసింది. అయితే,ఎస్‌ఈసీ నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలు, అర్హతలను నిర్ణయించి మంత్రిమండలి సిఫార్సుల మేరకు ఆర్డినెన్స్‌ ద్వారా నియమించే అధికారం రాష్ట్ర శాసన వ్యవస్థకు లేదని చెప్పింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించే విచాక్షణాధికారం రాజ్యాంగంలోని అధికరణ 243కే (1) ప్రకారం గవర్నర్‌కు ఉందని తెలిపింది.

సుప్రీంకోర్టుకెళ్తాం.. తీర్పు అమలును నిలిపేయండి
ఇదిలా ఉంటే.. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు వీలుగా ఈ తీర్పు అమలును నిలిపేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు ఓ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ తీర్పు అమలును నిలుపుదల చేయని పక్షంలో తమ న్యాయ ప్రయోజనాలు దెబ్బతింటాయని ప్రభుత్వం ఆ పిటిషన్‌లో పేర్కొంది. వెబ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ధర్మాసనం ఈ తీర్పు వెలువరించిన వెంటనే, తీర్పు అమలుపై స్టే గురించి అడ్వకేట్‌ జనరల్‌ ప్రసావించేందుకు సిద్ధమవుతుండగా, వెబ్‌ కాన్ఫరెన్స్‌ కనెక్షన్‌ కట్‌ అయిందని తెలిపింది. ఈలోపు ధర్మాసనం తన కోర్టు ప్రొసీడింగ్స్‌ను ముగించిందని పేర్కొంది. సీపీసీ నిబంధనల ప్రకారం తీర్పు అమలుపై స్టే విధించే అధికారం న్యాయస్థానానికి ఉందని ప్రభుత్వం తెలిపింది. ఈ పిటిషన్‌ను ధర్మాసనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. 

ఎస్‌ఈసీగా రమేష్‌కుమార్‌ బాధ్యతలు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తాను తిరిగి బాధ్యతల్లో చేరినట్లు పేర్కొంటూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ హోదాలో శుక్రవారం సాయంత్రం సర్కులర్‌ జారీ చేశారు. 

>
మరిన్ని వార్తలు