కనీస వసతులు లేకుండా హైకోర్టు ఏర్పాటు చేస్తారా?

25 Oct, 2019 03:12 IST|Sakshi

సీజే నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర అసంతృప్తి

సరైన సదుపాయాలు లేనందువల్ల అందరం ఇబ్బందులు పడుతున్నాం

కనీసం కప్పు టీ కూడా దొరకడం లేదు

ఈ పరిస్థితిని మార్చేందుకు ఏం చేస్తారో చెప్పాలి

పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం

సాక్షి, అమరావతి:  హైకోర్టులో సౌకర్యాల లేమిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించకుండా హైకోర్టు ఏర్పాటు చేయడం వల్ల అందరూ పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. హైకోర్టుకు వచ్చేందుకు రోజూ ఇబ్బందులు పడుతున్నామంది. హైకోర్టు న్యాయమూర్తులైన తమకు ఇప్పటివరకు నివాస గృహాలు కూడా లేవని, ఇప్పటికీ ప్రైవేట్‌ అతిథి గృహాల్లో ఉంటున్నామని, ఈ పరిస్థితి ఎంత కాలమని ప్రశ్నించింది. న్యాయవాదులు కార్లు పార్కింగ్‌ చేసేందుకు, కూర్చోడానికి తగినంత స్థలం లేదని, హైకోర్టు వద్ద ఒక్క కప్పు టీ కూడా దొరికే పరిస్థితి లేదని వ్యాఖ్యానించింది. సౌకర్యాల లేమిపై న్యాయవాదుల నుంచి తమకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయని తెలిపింది. సౌకర్యాల కల్పనకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

స్విస్‌ చాలెంజ్‌ కింద కుదుర్చుకున్న ఒప్పందాలన్నింటినీ పునఃసమీక్షిస్తున్నామని ప్రభుత్వం నివేదించిన నేపథ్యంలో దాని వివరాలను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. రెండు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి ఎటువంటి గడువు ఇచ్చే ప్రసక్తే లేదని, ఇదే చివరి అవకాశమంటూ విచారణను నవంబర్‌ 21కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.ఈ కేసులో తమ పరిధిని రాజధాని ప్రాంత అభివృద్ధి అంశానికి విస్తరింపచేస్తామని స్పష్టం చేసింది.

ఇవీ వ్యాజ్యాలు...
స్విస్‌ చాలెంజ్‌ కింద సింగపూర్‌ కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనను ఆమోదిస్తూ జారీ చేసిన జీవో 170కి సవరణలు చేస్తూ టీడీపీ సర్కారు తెచ్చిన జీవో 1ని సవాలు చేస్తూ చెన్నైకి చెందిన ఎన్వీయన్‌ ఇంజనీర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 2017లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. స్విస్‌ చాలెంజ్‌ను సవాలు చేస్తూ మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు కూడా హైకోర్టులో 2018లో ‘పిల్‌’ దాఖలు చేశారు. ఏపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఎనేబలింగ్‌ యాక్ట్‌ (ఏపీఐడీఈ) సవరణ చట్టాన్ని రద్దు చేయాలని హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫౌండేషన్‌ ఫర్‌ సోషల్‌ అవేర్‌నెస్‌ సభ్యుడు యడవిల్లి సూర్యనారాయణమూర్తి 2018లో మరో పిల్‌ దాఖలు చేశారు. స్విస్‌ చాలెంజ్‌ కింద జరిగిన ఒప్పందాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఈ ఏడాది హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. వీటిపై సీజే జస్టిస్‌ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం గురువారంవిచారించింది.

గత ఒప్పందాలపై పునఃసమీక్ష జరుగుతోంది...
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఎవరూ హాజరు కాకపోవడంతో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తూ స్విస్‌ చాలెంజ్‌ కింద గతంలో జరిగిన ఒప్పందాలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేస్తోందని వివరించారు.  ధర్మాసనం స్పందిస్తూ ఇంకెన్నాళ్లు చేస్తారు? జాప్యాన్ని సహించేది లేదని పేర్కొంది. 

గత సర్కారు ఇచ్చిన తప్పుడు అఫిడవిట్‌ ఫలితమే!
సాక్షి, అమరావతి: విభజన అనంతరం హైకోర్టు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చాలా రోజులు ఉమ్మడిగానే కొనసాగింది. తెలంగాణ భూభాగంలో ఏపీ హైకోర్టును వేరుగా ఏర్పాటు చేసేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, భవనాలను కూడా ఇస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రతిపాదించారు.  ఏ రాష్ట్ర హైకోర్టు ఆ రాష్ట్ర భూభాగంలోనే ఉండాలంటూ హైకోర్టు 2015లో తీర్పునిచ్చింది. అటు తరువాత ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఉమ్మడి హైకోర్టును విభజించి తెలంగాణ భూభాగంపై ఏపీ హైకోర్టును ఏర్పాటు చేసేందుకు తమకు అభ్యంతరం లేదని 2018 అక్టోబర్‌లో ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది.

దీనిపై సుప్రీంకోర్టు నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వివరణ కోరగా చంద్రబాబు సర్కారు తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేసింది. అమరావతిలో డిసెంబర్‌ 15కల్లా హైకోర్టు భవనం సిద్ధమవుతుందని లిఖితపూర్వకంగా సుప్రీంకోర్టుకు తెలిపింది. చంద్రబాబు ప్రభుత్వ అఫిడవిట్‌ను విశ్వసించిన సుప్రీంకోర్టు జనవరి 1కల్లా ఏపీ హైకోర్టు ఏర్పాటు నోటిఫికేషన్‌ వస్తుందని భావిస్తున్నామంటూ ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రపతి 2019 జనవరి 1 నుంచి ఏపీ హైకోర్టు అమరావతి కేంద్రంగా కార్యకలాపాలను ప్రారంభిస్తుందంటూ గత ఏడాది డిసెంబర్‌ 26న నోటిఫికేషన్‌ ఇచ్చారు. జనవరి 1 నుంచి హైకోర్టు కార్యకలాపాలను ప్రారంభించింది.

మొదటి కోర్టు హాలు మాత్రమే చూపించి...
గత ఫిబ్రవరిలో నేలపాడులో హైకోర్టు తాత్కాలిక భవనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ప్రారంభించారు. ఆ రోజుకు సైతం హైకోర్టు భవనం నిర్మాణం పూర్తి కాలేదు. హైకోర్టు హాళ్లను పరిశీలించాలని భావించిన జస్టిస్‌ గొగోయ్‌కు అప్పటి ప్రభుత్వం కేవలం మొదటి కోర్టు హాలును మాత్రమే చూపించింది. మిగిలిన కోర్టు హాళ్లు కూడా ఇలాగే ఉంటాయంటూ వాటిని చూసే అవకాశం లేకుండా చేసింది. నిజానికి అప్పటికి హైకోర్టు భవన నిర్మాణ పనులు 50 శాతం కూడా పూర్తి కాలేదు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు ప్రభుత్వం మార్చి 18న హడావుడిగా విజయవాడలో ఉన్న హైకోర్టును నేలపాడులోని తాత్కాలిక భవనంలోకి మార్చింది. అప్పటికి కూడా హైకోర్టు చుట్టూ బురదే. పలు సందర్భాల్లో వర్షాలకు హైకోర్టు మొత్తం లీకైంది. అక్కడకు బస్సు సదుపాయం కూడా లేదు. షామియానాలు వేసి కొద్ది రోజులు భోజన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం బయట నుంచి ఓ చిన్న వ్యాన్‌లో వస్తున్న భోజనమే చాలా మంది  న్యాయవాదులకు, కక్షిదారులకు దిక్కు. ఇప్పటికీ హైకోర్టు నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి.

>
మరిన్ని వార్తలు