భద్రత పెంపు కోసం దరఖాస్తు చేసుకోండి 

20 Feb, 2019 08:17 IST|Sakshi

విజయసాయిరెడ్డికి హైకోర్టు స్పష్టీకరణ 

సాక్షి, అమరావతి: ప్రాణహాని ఉందన్న నేపథ్యంలో 2+2 భద్రత కోసం పోలీసులకు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డికి హైకోర్టు స్పష్టం చేసింది. విజయసాయిరెడ్డి దరఖాస్తు పెట్టుకున్న పది రోజుల్లో దానిపై తగిన నిర్ణయం తీసుకోవాలని హోంశాఖను హైకోర్టు ఆదేశించింది. ఆ నిర్ణయాన్ని సాయిరెడ్డికి తెలియజేయాలని స్పష్టం చేస్తూ జస్టిస్‌ కొంగర విజయలక్ష్మి మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ప్రాణహాని ఉన్నా, ప్రభుత్వ యంత్రాంగం తనకు 2+2 భద్రతను కల్పించకపోవడాన్ని సవాలు చేస్తూ విజయసాయి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్‌ విజయలక్ష్మి విచారణ జరిపారు. 

పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎస్‌. శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. సాయిరెడ్డికి భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, భద్రత పెంపు కోసం తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సాయిరెడ్డికి స్పష్టం చేశారు. ఆ దరఖాస్తుపై ఆలస్యం చేయకుండా పది రోజుల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని పోలీసులను ఆదేశిస్తూ ఈ వ్యాజ్యాన్ని మూసివేశారు.    

మరిన్ని వార్తలు