‘వైఎస్‌ జగన్‌ మాటిస్తే.. మళ్లీ గుర్తు చేయాల్సిన పనిలేదు’

29 Oct, 2019 14:44 IST|Sakshi

తాడేపల్లిలో అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ సమావేశం

పాల్గొన్న హోంమంత్రి సుచరిత, బొత్స, సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి : చంద్రబాబు హయాంలో అగ్రిగోల్డ్ సమస్య సృష్టించి జనాన్ని మోసం చేశారని, కానీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో బాధితులను ఆదుకున్నారని అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో అగ్రిగోల్డ్‌ బాధితుల జాయింట్‌ యాక‌్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఈ సమావేశం జరిగింది.

సమావేశంలో పాల్గొన్న హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ..  7 రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ సంస్థ 6500 కోట్లు వసూళ్లు చేసింది. అగ్రిగోల్డ్ సంస్థలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. బాధితులను ఆదుకోవాలని చంద్రబాబుకు ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోలేదు. ఆయన మనిషి కాదు మరమనిషి. బాధితుల కష్టాలు విన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ‘నేను ఉన్నాను నేను విన్నాను’ అంటూ హామీ ఇచ్చారు. తొలి కేబినెట్‌ భేటీలోనే బాధితులను ఆదుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. కులం మతం చూడకుండా బాధితులకు సీఎం న్యాయం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.1150 కోట్లు కేటాయించారు. అగ్రిగోల్డ్ ఆస్తులపై విచారణ జరుగుతుంది’అన్నారు.

మంత్రి బొత్స మాట్లాడుతూ..  రూ.1150 కోట్లు మంజూరు చేసి సీఎ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం అంటూ ఢిల్లీ వచ్చి చంద్రబాబు అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేయలని చూశారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి, బాధితులకు స్వయంగా చెక్కులు ఇవ్వాలని కోరుతాం’అన్నారు. కోట్ల రూపాయల విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులు మీద టీడీపీ నాయకుల కన్ను పడిందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వందల మంది చనిపోయినా.. లక్షల మంది బాధపడుతున్నా చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. శవాలు మీద చిల్లర దండుకోవాలని టీడీపీ నాయకులు ప్రయత్నం చేశారని ఎద్దేవా చేశారు. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి, ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మాట ఇచ్చి తప్పడం అలవాటు లేదని అన్నారు. వైఎస్‌ జగన్‌ మాట ఇస్తే మళ్లీ పని చేయండని గుర్తు చేయాల్సిన అవసరం లేదని సజ్జల పేర్కొన్నారు.

ఇక ఈ సమావేశంలో మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే విడదల రజని, రాష్ట్ర అధికారప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ అగ్రిగోల్డ్ బాధిత బాసట కమిటీ కో ఆర్డినేటర్ లేళ్ల అప్పిరెడ్డితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ బాధితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిగతా అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని,  బాధితులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని వారు పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు