ఏపీలోని మున్సిపల్ స్కూల్లో హౌస్‌ఫుల్ బోర్డు

10 Jun, 2016 02:14 IST|Sakshi
ఏపీలోని మున్సిపల్ స్కూల్లో హౌస్‌ఫుల్ బోర్డు

 సీట్లు లేవని బోర్డు పెట్టిన పాఠశాల
 

మున్సిపల్ ఉన్నత పాఠశాలలో హౌస్‌ఫుల్ బోర్డు పెట్టారు.. నిజమే..  ఏపీలోని నెల్లూరులోని కేఎన్నార్ మున్సిపల్ హైస్కూలు ముందు ఈ బోర్డు కనిపిస్తోంది. సాధారణంగా కార్పొరేట్ పాఠశాలల్లో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తుంటాయి. ఇప్పుడు నెల్లూరు నగరపాలక సంస్థ పాఠశాలలో కూడా ఈ దృశ్యం కనిపించడం చర్చనీయాంశంగా మారింది. 7, 8, 9, 10 తరగతుల్లో సీట్లు లేవు అని ఇక్కడ బోర్డు పెట్టారు. ఏటా పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు వస్తుండటంతో పేద, మధ్యతరగతికి చెందిన ప్రజలు ఈ పాఠశాలలో పిల్లలను చేర్చేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిష్, తెలుగు మీడియంలలో బోధిస్తున్నారు.

ఇప్పటికే ఇంగ్లిష్, తెలుగు మీడియంలలో 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 200 నుంచి 220 మంది వరకు విద్యార్థులున్నారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయప్రకాష్ తెలిపారు. కేవలం 6వ తరగతికి మాత్రమే బడి పునఃప్రారంభమైన 13వ తేదీ నుంచి కొత్తగా విద్యార్థులను చేర్చుకుంటామని చెప్పారు. ఏటా ఈ స్కూల్లో 1,200 మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు.  - నెల్లూరు టౌన్

>
మరిన్ని వార్తలు