ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరావు బదిలీ

29 Mar, 2019 14:23 IST|Sakshi

సాక్షి, అమరావతి : హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం శుక్రవారం జీవో నంబర్‌ 750 జారీ చేసింది. ప్రస్తుత ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ ఎటువంటి ఎన్నికల విధులను ఏబీ వెంకటేశ్వరరావుకు అప్పగించవద్దంటూ జీవోలో పేర్కొంటూ.. హెడ్‌ క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. కాగా అంతకు ముందు ఏబీ వెంకటేశ్వరరావు...ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు పాటించాల్సిందేనంటూ హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో వీరు భేటీ జరిగింది. చంద్రబాబు సర్కార్‌ ... వెంకటేశ్వరరావును బదిలీ చేయకుండా ఉండేందుకు చివరకు ప్రయత్నాలు సాగించిన విషయం విదితమే. ఓ వైపు ఈసీ స్పష్టమైన ఆదేశాలు... మరోవైపు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కూడా ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేయాల్సిందేనని ఆదేశాలు ఇవ్వడంతో .... బాబు సర్కార్‌ దిగిరాక తప్పలేదు. చదవండి...(ఇంటెలిజెన్స్‌ డీజీపై వేటు)

ఏపీలో అధికార టీడీపీ సేవలో తరిస్తూ, విధి నిర్వహణలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్న ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసిన విషయం విదితమే. ఆయనతోపాటు వైఎస్సార్, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు రాహుల్‌దేవ్‌ శర్మ, వెంకటరత్నంలను కూడా బదిలీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రంలో పలువురు పోలీసు అధికారులు పనిచేస్తున్నారంటూ ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పలుమార్లు చేసిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం స్పందించింది. అయితే ఈసీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఏపీ సర్కార్‌...హైకోర్టును ఆశ్రయించినా చుక్కెదురు అయింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు శుక్రవారం తీర్పును వెల్లడిస్తూ... ఈసీ ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని  తేల్చిచెప్పింది. బదిలీలపై ఏపీ ప్రభుత్వ వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం ఈసీ ఆదేశాలను శిరసావహించాల్సిందేనని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. చదవండి...  (ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు)

చదవండి...(ఏబీవీ.. బాబు రాజకీయానికి బినామీ)

మరిన్ని వార్తలు