సాగు కోసం సాగరమై..

10 Aug, 2019 03:12 IST|Sakshi

శ్రీశైలం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన తెలంగాణ, ఏపీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, అనిల్‌ కుమార్‌

సాగర్‌కు పోటెత్తుతున్న వరద.. 148 టీఎంసీలకు చేరిన నిల్వ 

1.77 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో..  

సాగర్‌ నిండితే 6.30 లక్షల ఎకరాలకు నీటికి ఢోకా లేనట్లే

సాక్షి, హైదరాబాద్‌ : రెండు నెలలుగా నీటి రాకకై ఎదురుచూస్తున్న సాగర్‌ పరీవాహక రైతుల ఆశలను సజీవం చేస్తూ, ఖరీఫ్‌ ఆయకట్టు పంటలకు ధీమానిస్తూ నాగార్జున సాగర్‌ వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ఏడాదిపాటు తాగు, సాగు నీటి అవసరాలను తీర్చేలా వరద పోటెత్తుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిన నేపథ్యంలో 6 గేట్లు పైకెత్తి నీటిని దిగువకు వదులుతుడటంతో ఆ నీరంతా సాగర్‌ వైపు ఉధృతంగా ప్రవహిస్తోంది.

దీంతో శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్టులోకి 1.77 లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహం నమోదు కాగా నిల్వ 312 టీఎంసీలకుగానూ 148 టీఎంసీలకు చేరుకుంది. ఈ ప్రవా హం శనివారానికి 3 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉంది. అటు ఎగువ కృష్ణా, ఇటు భీమానదికి వరద, మరోపక్క తుంగభద్ర నుంచి సైతం వరద కొనసాగే అవకాశాల నేపథ్యంలో సాగర్‌ వారం రోజుల్లోనే పూర్తిగా నిండిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే ప్రాజెక్టు కింద 6.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటికి ఎలాంటి ఢోకా ఉండదు. 

గతేడాది కన్నా 10 రోజుల ముందే 
మహారాష్ట్ర, కర్ణాటకల్లోని పశ్చిమకనుమల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానదిలో వరద ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. కృష్ణానదిపై ఎగువన నిర్మించిన ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాలు నిండుకుండల్లా మారడం.. భీమానదిపై ఎగువన నిర్మించిన ఉజ్జయిని డ్యామ్‌ నిండిపోవడం.. ఎగువ నుంచి భారీ వరద వస్తోండటంతో ముందుజాగ్రత్తగా ఆ మూడు జలాశయాల్లో నీటి నిల్వలను తగ్గించుకుంటూ.. దిగువకు భారీఎత్తున వరద ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు. ఆ జలాలు జూరాల మీదుగా శ్రీశైలం జలాశయానికి చేరుతున్నాయి. 

దీంతో శ్రీశైలం జలాశయంలోకి 3,16,986 క్యూసెక్కులు రావడం వల్ల నీటి నిల్వ 192.97 టీఎంసీల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం 5 గంటలకు ఏపీ, తెలంగాణ మంత్రులు డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లు శ్రీశైలం ప్రాజెక్టు 7, 8, 9, 10 గేట్లు ఎత్తి 1.06 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. వరద ఉధృతి పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తి.. దిగువకు విడుదల చేసే వరద ప్రవాహాన్ని పెంచుతారు. 2017–18లో అక్టోబర్‌ 12న, గతేడాది ఆగస్టు 18న శ్రీశైలం గేట్లు ఎత్తి సాగర్‌కు వరద జలాలను విడుదల చేయగా, ఈసారి గతేడాది కంటే 10 రోజుల ముందే గేట్లు ఎత్తి దిగువగకు నీటిని వదలడం గమనార్హం. 
 
ఖరీఫ్‌కి ఊపిరి 
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన జలాల్లో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నాగార్జునసాగర్‌లోకి 1,77,911 క్యూసెక్కులు చేరుతున్నాయి. దాంతో నాగార్జునసాగర్‌లో నీటి మట్టం 517.10 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం సాగర్‌లో 148 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. సాగర్‌ నిండాలంటే మరో 164 టీఎంసీలు అవసరం. కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండం.. ఎగువన జలాశయాలన్నీ నిండుకుండలా మారిన నేపథ్యంలో వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేయక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వస్తున్న వరద కనీసం 10రోజులపాటు కొనసాగే అవకాశముంది. అదే జరిగితే వారం రోజుల్లో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిండడం ఖాయమని అధికాలుంటున్నారు. 

అదే జరిగితే సాగర్‌ ఎడమ కాల్వ కింద ఉన్న 6.30లక్షల ఎకరాల ఆయకట్టు సాగునీటికి ఎలాంటి ఢోకా ఉండదు. ఆయకట్టు నీటి విడుదలపై త్వరలోనే ప్రాజెక్టు ఇంజనీర్లు షెడ్యూల్‌ తయారీ చేసే అవకాశం ఉంది. 2016–17లో ఖరీఫ్‌లో 3.18లక్షల ఎకరాల ఆయకట్టుకు 19.45 టీఎంసీల నీటిని, 2017–18లో కేవలం 4.43 టీఎంసీల నీటిని విడుదల చేశారు. 2018–19లో ఖరీఫ్‌ అవసరాలకు 33.31 టీఎంసీల నీటిని విడుదల చేసి 5.96లక్షల ఎకరాలకు నీటిని అందించారు. గతేడాది ఆగస్టు 22 నుంచి నవంబర్‌ వరకు ఐదారు తడుల్లో నీటిని అందించారు. ఈ ఏడాది సైతం ఆగస్టు చివరి వారం నుంచి సాగర్‌ ఆయకట్టుకు నీటిని విడుదల చేసే అవకాశాలున్నాయి. 
 
తుంగభద్రకూ వరద ఉధృతి 
తుంగభద్ర నదిలోనూ వరద ప్రవాహం పెరిగింది. ఎగువన జలాశయాలన్నీ నిండటంతో దిగువకు భారీగా నీరు విడుదలవుతోంది. శుక్రవారం సాయంత్రం 6గంటలకు తుంగభద్ర జలాశయంలోకి 1,69,261 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో 66.75 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. తుంగభద్ర జలాశయం నిండాలంటే ఇంకా 34 టీఎంసీలు అవసరం. వరద ప్రవాహం ఇదే రీతిలో కొనసాగితే మరో 3రోజుల్లోనే తుంగభద్ర జలాశయం నిండటం ఖాయం. తుంగభద్ర జలాశయంలో నీటి మట్టం గరిష్టస్థాయికి చేరితే.. విద్యుదుత్పత్తి కేంద్రాలు, గేట్లు ఎత్తడం ద్వారా మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తారు. ఆ జలాలు సుంకేశుల బ్యారేజీ మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరనున్నాయి. 

మరిన్ని వార్తలు