ఐటీ మంత్రిని కలిస్తే అర కోటి తగ్గించారు

21 Sep, 2017 09:22 IST|Sakshi
ఐటీ మంత్రిని కలిస్తే అర కోటి తగ్గించారు

విశాఖ ఐటీ సెజ్‌లో భూ కేటాయింపుల వ్యవహారం
ఏపీఐఐసీతో సహా ఆర్థిక శాఖ, సీఎస్‌ వ్యతిరేకించినా ఆగలేదు
ఐటీ మంత్రి ఆదేశంతో ఇటీవల కేబినెట్‌కు ప్రతిపాదనలు
ఖజానాకు అరకోటి నష్టం కలిగిస్తూ కేబినెట్‌ ఆమోదం  
 

సాక్షి, అమరావతి: సాధారణంగా ప్రజలు చెల్లించే విద్యుత్‌ చార్జీలను గానీ, పన్నులను గానీ ఏ ప్రభుత్వమైనా పెంచడమే గానీ తగ్గించడం జరగదు. అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్‌ చార్జీలను, భూముల మార్కెట్‌ విలువను ప్రతీ ఏడాది పెంచుతూ వస్తోంది. కానీ విచిత్రంగా ఒక ఐటీ కంపెనీ ప్రతినిధులు ఐటీ శాఖ మంత్రిని కలవగానే భూమి ధర రూ.50 లక్షలకు పైగా తగ్గిపోయింది.

అదీ కూడా కేటాయించిన రెండేళ్ల అనంతరం. ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక పెట్టుబడుల కార్పొరేషన్‌ (ఏపీఐఐసీ) సాధ్యం కాదన్నా, ఆర్థికశాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తప్పుపట్టినా మంత్రి మాటే నెగ్గింది. ధర తగ్గిస్తూ రాష్ట్ర ఖజానాకు రూ.అర కోటికి పైగా నష్టం కలిగిస్తూ ఆ కంపెనీ కోరిన విధంగా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే...

అందరూ వద్దన్నా... కేబినెట్‌ ఆమోదం
విశాఖపట్టణం నగర సమీపంలోని మధురవాడలో ఐటీ సెజ్‌లో ‘ఇన్నోమైండ్స్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ దరఖాస్తు మేరకు ఏపీఐఐసీ 2015 ఏప్రిల్‌ 30వ తేదీన రెండు ఎకరాల భూమిని చదరపు మీటర్‌ రూ.5,600 చొప్పున కేటాయించింది. ఈఎండీ(ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌) కింద చెల్లించిన పది శాతం మినహాయించి మిగతా రూ.4,53,26,400 వెంటనే చెల్లించాల్సిందిగా ఏపీఐఐసీ సూచించింది. అయితే ఇన్నోమైండ్స్‌ డబ్బులు చెల్లించకపోగా ధరను తగ్గించాల్సిందిగా ఏపీఐఐసీకి దరఖాస్తు చేసింది.

ఒకసారి ధర నిర్ణయించి కేటాయించిన భూమి ధరను తగ్గించే అధికారం ఏపీఐఐసీకి లేదు. ధీంతో ఏపీఐఐసీ 2015 సెప్టెంబర్‌ 8వ తేదీన ఆ కేటాయింపును రద్దు చేయడమే కాకుండా పది శాతం ఈఎండీని తిరిగి చెల్లించింది. అనంతరం ఆ రెండు ఎకరాలను చదరపు మీటర్‌కు రూ.5,600 చొప్పున ఫ్యాబ్‌ ల్యాబ్‌కు కేటాయించింది. అయితే ఫ్యాబ్‌ ల్యాబ్‌ కూడా ఐటీ కంపెనీని ఏర్పాటు చేయలేదు.

ఈ నేపథ్యంలో ఇన్నోమైండ్స్‌ కంపెనీ 2016 మే 24వ తేదీన ఆ రెండు ఎకరాలను తిరిగి తమకు కేటాయించాల్సిందిగా ఏపీఐఐసీని కోరింది. అయితే 30 మంది ఉద్యోగులతో తక్షణం స్టార్టప్‌ విలేజ్‌ను ప్రారంభించాలని షరతు విధిస్తూ ఏపీఐఐసీ ఆ రెండు ఎకరాల భూమిని చదరపు మీటర్‌కు రూ.6,280 చొప్పున 2016 జూలై 26వ తేదీన రూ.5,08,30,320కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

అయితే గతంలో కేటాయించిన ధరకే భూమిని కేటాయించాలని ఇన్నోమైండ్స్‌ కోరింది. ధర తగ్గించడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన ఏపీఐఐసీ మరోసారి కేటాయింపులను రద్దు చేసింది. దీంతో ఇన్నోమైండ్స్‌ ప్రతినిధులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ను కలిసి ధర తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. పాత ధరకే కేటాయించాలంటూ ఐటీ శాఖ మంత్రి ఏపీఐఐసీని కోరారు.

ఒకసారి ధర నిర్ణయించి కేటాయింపులు చేసిన తరువాత ధర తగ్గించడం సాధ్యం కాదని ఏపీఐఐసీ స్పష్టం చేసింది. ఏదైనా ఉంటే మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవాల్సిందే తప్ప తమ పరిధిలోకి రాదని పేర్కొంది. అయితే మంత్రి ఆదేశాల మేరకు చదరపు మీటర్‌కు రూ.5,600 చొప్పున కేటాయించే ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలను కేబినెట్‌కు పంపేందుకు ముందే ఆర్థిక శాఖ పరిశీలించి వ్యతిరేకతను వ్యక్తం చేసింది.

ఇటువంటి ప్రతిపాదనలను పరిశీలించడం తప్పుడు సంప్రదాయం అవుతుందని, ఈ నేపథ్యంలో ఈ ప్రతిపాదనను పరిశీలించరాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా స్పష్టం చేశారు. అయినా సరే ఇటీవల జరిగిన కేబినెట్‌లో ఖజానాకు రూ.55,03,920కు పైగా నష్టం కలిగిస్తూ కంపెనీకి ఆ మేర ప్రయోజనం కలిగిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ ప్రాంతంలో బహిరంగ మార్కెట్‌లో ఎకరా రూ.10 కోట్లు పైగా ధర పలుకుతోందని తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు