అనుబంధాలకు ‘కఠిన కారాగార’ శిక్ష

1 Jul, 2020 04:39 IST|Sakshi

కరోనా ఎఫెక్ట్‌తో ములాఖత్‌లు బంద్‌

రాష్ట్రంలోని 110 జైళ్లలో 6,150 మంది ఖైదీలపై ఆంక్షలు 

కరోనా కట్టడి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టిన జైళ్ల అధికారులు 

ఫోన్‌లో మాట్లాడే సదుపాయమే ఊరట 

‘మా కుటుంబ సభ్యులు వచ్చి పలకరిస్తే కొంత బాధ తీరేది. మనోధైర్యం వచ్చేది. మళ్లీ వాళ్లెప్పుడు వస్తారా? అని ఎదురు చూసేవాడిని. కరోనా వల్ల మా కుటుంబ సభ్యులను చూడలేని పరిస్థితిలో ఉన్నా. మూడు నెలలుగా ఎవరినీ చూడలేదనే బాధ, బెంగ ఎక్కువయ్యాయి. బయటి వారిని జైలులో కలవకుండా కట్టడి చేయడం మా మేలు కోసమే అని సరిపెట్టుకుంటున్నాం. జైలు అధికారులు మా వాళ్లతో ఫోన్‌లో మాట్లాడుకునే అవకాశం ఇస్తున్నారు. అది కొంత ఊరట’ 
– ఇది రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్‌లోని ఓపెన్‌ ఎయిర్‌ జైలు ఖైదీగా ఉన్న గుంటూరుకు చెందిన పి.సాంబ శివరావు ఆవేదన 

 
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి అనుబంధాలకు ‘కఠిన కారాగార శిక్ష’ విధించింది. రాష్ట్రంలోని అన్ని జైళ్లలోనూ అయిన వారిని చూసేందుకు, నేరుగా మాట్లాడేందుకు వీలు లేక ఖైదీలకు ఎదురు చూపులు తప్పని పరిస్థితి నెలకొంది. అయిన వారికి దూరంగా జైలు జీవితం గడుపుతున్న వారంతా వారానికో, నెలకో తమ వారి పలకరింపుతో పరవశించిపోయేవారు. ఇప్పుడు ఆ అవకాశం లేక జైలు జీవితం అ త్యంత భారంగా గడుస్తోందని వాపోతున్నారు. ఖైదీల్లో మానసిక వేదన తగ్గించేందుకు ప్రభుత్వ ఆ దేశాల మేరకు జైలు అధికారులు అనేక చర్యలు చేపడుతున్నారు. 

► రాష్ట్రంలో విశాఖపట్నం, రాజమహేంద్రవరం, నెల్లూరు, వైఎస్సార్‌ కడపలలోని నాలుగు కేంద్ర కారాగారాలు (సెంట్రల్‌ జైళ్లు)తోపాటు ఏడు జిల్లా జైళ్లు, 11 ప్రత్యేక సబ్‌ జైళ్లు, రెండు మహిళా జైళ్లు, 82 సబ్‌జైళ్లు, బోస్టన్‌ జైలు, అగ్రికల్చర్‌ కాలనీ జైలు, రెండు ఓపెన్‌ జైళ్లు ఉన్నాయి.  
► కరోనా నేపథ్యంలో జైళ్లల్లో రద్దీని తగ్గించేందుకు కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటి వరకు 463 మందిని మధ్యం తర బెయిల్‌పై ఇళ్లకు పంపించారు. బెయిల్‌ గడువు తీరిన వెంటనే వారు జైలుకు రావాల్సి ఉంటుంది.   
► ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 110 జైళ్లలో దాదాపు 6,150 మంది ఖైదీలకు కరోనా ఇబ్బంది రాకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు జైలు అధికారులు కఠినమైన ఆంక్షలను అమలు చేస్తున్నారు.  
► జైలులో ఉండే ఖైదీలు.. కుటుంబ సభ్యు లు, బంధుమిత్రులతో కలిసి మాట్లాడే వీలు లేకుండా మూడు నెలలుగా ములా ఖత్‌లు పూర్తిగా రద్దు చేశారు. వేర్వేరు ప్రాంతాల నుంచి జైలుకు వచ్చి ఖైదీలను చూసి మాట్లాడే అవకాశం ఇస్తే కరోనా వైరస్‌ ఖైదీలకు సోకే ప్రమాదం ఉన్నందునే రద్దు చేశారు.  
► ఖైదీలు తమ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడుకునే వెసులుబాటు కల్పించారు. గతంలో వారానికి రెండు పర్యాయాలు ఫోన్‌ సౌకర్యం కల్పిస్తే ఇప్పుడు నాలుగు పర్యాయాలు పదేసి నిముషాల చొప్పున తమ వారితో ఫోన్‌ మాట్లాడుకునే అవకాశం ఇచ్చారు.  
► జైలు పరిసరాల్లోకి కొత్త వ్యక్తులను ఎవరినీ అనుమతించడంలేదు. జైలు పరిసరాల్లో శానిటైజ్‌ చేస్తున్నారు. 
► జైలులోని ఖైదీలకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయడం, మాస్క్‌లు, గ్లౌజులు అందించడంతోపాటు వారు వ్యక్తిగత దూరం (ఫిజికల్‌ డిస్టెన్స్‌) పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. 
► జైలు బ్యారక్‌లలో తక్కువ మందిని ఉంచడం, ఉదయం అల్పాహారం, మద్యాహ్నం, సాయంత్రం భోజనం సమయంలో వారందరినీ ఒకేసారి వదలకుం డా పది మంది చొప్పున జైలు ఆవరణలో విడిచిపెడుతున్నారు. బ్యారక్‌ లోపల, జైలు ఆవరణలోను ఖైదీలు భౌ తిక దూరం పాటించేలా చూస్తున్నారు.  
► రాష్ట్రంలోని అన్ని జైళ్లలో ఖైదీలకు అవసరమైన మాస్కులను జైళ్లలోనే తయారు చేస్తున్నారు. ప్రధానంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, నెల్లూరు, వైఎస్సార్‌ కడప సెంట్రల్‌ జైళ్లతోపాటు విజయవాడ, ఒంగోలు డిస్ట్రిక్ట్‌ జైళ్లలో మాస్కులు తయారు చేస్తున్నారు. ఖైదీలు తయారు చేసే మాస్కులు, శానిటైజర్లు, చేతి గ్లౌజులను అన్ని జైళ్లలోని ఖైదీలు ఉపయోగించుకోగా మిగిలిన వాటిని స్థానికంగా ఉండే వ్యాపారులకు విక్రయిస్తున్నారు. 

కొత్తగా జైలుకు వస్తే 21 రోజులు ఐసోలేషన్‌ వార్డులోనే.. 
ఇప్పటి వరకు రాష్ట్రంలోని రాజమహేంద్రవరం, నెల్లూరు, కడప, అనంతపురం జైళ్లలో ఐదుగురు ఖైదీలకు కరోనా సోకింది. వారంతా జైలుకు కొత్తగా వచ్చిన వారే కావడం గమనార్హం. ఖైదీలను జైలుకు తీసుకొచ్చే ముందే కోవిడ్‌ పరీక్ష చేయిస్తున్నారు.  పాజిటివ్‌ వచ్చిన కొత్త ఖైదీలను తీసుకొచ్చిన వెంటనే వారిని 21 రోజలపాటు ఐసోలేషన్‌ వార్డులో ఉంచి తర్వాత పాత ఖైదీలు ఉండే బ్యారక్‌కు తరలిస్తున్నారు. పాత ఖైదీలకు ఎవరికి పాజిటివ్‌ రాలేదు.

ఖైదీల పట్ల  ప్రత్యేక శ్రద్ధ 
ఖైదీల పట్ల ప్రత్యేక శ్రధ్ద తీసుకుంటున్నాం. రిమాండ్‌కు వచ్చే వారికి కరోనా టెస్ట్‌లు నిర్వహించి, సింగిల్‌ లాకప్‌కు పరిమితం చేస్తున్నాం. నెగిటివ్‌ వచ్చిన తరువాతే మెయిన్‌ బ్లాక్‌లోకి పంపుతున్నాం. పాజిటివ్‌ అని తేలితే జైలుకు వచ్చిన వ్యక్తిని ఐసోలేషన్‌ వార్డుకు పంపుతున్నాం. నిత్యం ఉదయం, సాయంత్రం థర్మల్‌ లేజర్‌గన్‌ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నాం. దగ్గు, జలుబు, జ్వరం వంటివి వస్తే జిల్లా జైలు డాక్టర్‌ను అందుబాటులోకి తీసుకుని వస్తున్నాం. పూర్తిస్ధాయిలో చర్యలు తీసుకుని, కరోనా వైరస్‌ ప్రబలకుండా జాగ్రత్తలు పాటిస్తున్నాం. 
– గుంటూరు ఈస్ట్‌ జైలు సూపరిటెండెంట్‌ హంస పాల్‌ 

మరిన్ని వార్తలు