లాక్‌డౌన్‌: రవాణకు ఇబ్బంది లేకుండా ఈ-పాస్ సిస్టమ్‌

30 Mar, 2020 15:47 IST|Sakshi

సాక్షి, విజయవాడ: కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు దేశమంతట లాక్‌డౌన్‌ అమలవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు నిత్యావసర సరుకులకు ఇబ్బంది పడకుండా వాటిని అందుబాటులోకి తెచ్చే విషయంలో పర్యవేక్షణ కోసం కమాండ్‌ కట్రోల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మార్కెటింగ్‌ కమిషనర్‌ ప్రద్యుమ్నా తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిత్యావసర సరుకుల విషయంలో జిల్లాల్లో కూడా జేసీల అధ్వర్యంలో కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సరుకుల రవాణ, అధిక ధరలపై ఏమైనా ఫిర్యాదులు ఉంటే కంట్రోల్‌ నెంబర్‌ 1902కు డయల్‌ చేయాలని చెప్పారు. సరుకుల రవాణకు ఇబ్బంది లేకుండా ఈ-పాస్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టామని, పంటలను మార్కెట్టుకు తెచ్చే విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. (రేషన్‌' ఫ్రీ')

అంతేగాక నిత్యావసరాలకు సంబంధించి ప్రైవేటు రంగంలో పని చేసే ఉద్యోగులకు, సిబ్బందికి ఈ-పాస్ అందచేస్తున్నామని ఆయన తెలిపారు. సరుకులను ప్రజలకు అందజేసే విషయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని, ఇందుకోసం రైతు బజార్లను వికేంద్రీకరించామన్నారు. రాష్ట్రంలో మొత్తం 101 రైతు బజార్లు ఉంటే.. మరో 350 రైతు బజార్లను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని చెప్పారు. అంతేగాక 130 మొబైల్ రైతు బజార్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 753 మంది మాత్రమే డోర్ డెలివరీని వివియోగించుకుంటున్నారని, ఈ సంఖ్యను పెంచాల్సిందిగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కిరాణా షాపుల యజమానులు డోర్ డెలివరీకి సిద్దంగా ఉన్నారని, సప్లై చైన్ బ్రేక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నమని తెలిపారు. ఉల్లి, అరటి వంటి పంటలకు మార్కెటింగ్ ఇబ్బంది లేకుండా పొరుగు రాష్ట్రాల అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. (కరోనా చికిత్సకు కొత్త పరికరం)

మరిన్ని వార్తలు