‘కరోనా’పై మీడియాకు మార్గదర్శకాలు

21 Mar, 2020 05:17 IST|Sakshi

బాధితుల పేర్లు, చిరునామా వెల్లడించరాదు

పరిస్థితిపై రోజూ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల

సాక్షి, అమరావతి: కోవిడ్‌ –19 (కరోనా వైరస్‌)కు సంబంధించి వార్తా కథనాలపై పత్రికలు, టీవీ చానళ్ల అధిపతులు, ఎడిటర్లు, బ్యూరో చీఫ్‌లు, రిపోర్టర్లు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 

- రాష్ట్రంలో కరోనా వైరస్‌ పరిస్థితిపై వైద్య, ఆరోగ్యశాఖ ప్రతిరోజూ బులెటిన్‌ విడుదల చేస్తుంది. నిర్ధారించిన ఈ సమాచారాన్ని మాత్రమే పత్రికలు, టీవీలు పరిగణనలోకి తీసుకోవాలి.
- కరోనా వైరస్‌ కేసులు, వైరస్‌ వల్ల మరణాల విషయంలో అ«ధీకృత సమాచారం లేకుండా ప్రచురించరాదు, ప్రసారం చేయరాదు. మార్చి 20వ తేదీన విశాఖలో కరోనా వైరస్‌తో మరణం అంటూ పలు వార్తా సంస్థలు, చానళ్లు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం. 
- అనుమానిత కేసుల పేరుతో సమాచారాన్ని ప్రచురించరాదు, ప్రసారం చేయరాదు. కరోన వైరస్‌ సోకి పాజిటివ్‌గా వచ్చిన కేసుల విషయంలో బాధితుల పేర్లు, చిరునామాలు ప్రచురించరాదు, ప్రసారం చేయరాదు.
- వదంతులు, ఊహాజనిత అంశాలను ప్రసారం చేయరాదు, ప్రచురించరాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వెబ్‌సైట్లు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెబ్‌సైట్లను పరిశీలించడం ద్వారా వైరస్‌కు సంబంధించి సరైన సమాచారాన్ని పొందవచ్చు. 
- మూఢ నమ్మకాలను వ్యాప్తి చేసేలా సమాచారాన్ని ప్రచురించరాదు, ప్రసారం చేయరాదు. ఈ మార్గదర్శకాలు పాటించని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. 
- కరోనా వైరస్‌ నివారణ, ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రసార మాధ్యమాల సహకారాన్ని కోరుతున్నాం. 

మరిన్ని వార్తలు