వదంతులు నమ్మొద్దు.. ఆందోళన వద్దు

17 Mar, 2020 11:04 IST|Sakshi

కరోనా నిరోధక చర్యలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌

వైరస్‌ నియంత్రణకు యుద్ధప్రాతిపదికన చర్యలు

మాస్క్‌లు, శానిటైజర్ల కొరత రానివ్వం

ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి 

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌పై సోషల్‌ మీడియాలో వచ్చే వదంతుల్ని నమ్మొద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు. అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా వైరస్‌(కొవిడ్‌-19) నిరోధక చర్యలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ  బులెటిన్‌ విడుదల చేసింది. నెల్లూరు జిల్లాలో కరోనా బాధితుడు కోలుకుంటున్నారని పేర్కొన్నారు. 14 రోజులు పూర్తయ్యాక మళ్లీ శాంపిల్‌ను పరీక్షించి డిశ్చార్జ్‌ చేస్తామన్నారు. మాస్క్‌లు,శానిటైజర్ల కొరత రానివ్వం అని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ నియంత్రణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నిరంతరం సమీక్షిస్తున్నామని.. ప్రజలు ఆందోళన పడొద్దని ఆయన సూచించారు.
(నిలువునా ముంచిన ‘కరోనా’ )

కరోనా వైరస్‌ ప్రభావిత దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 840 మంది ప్రయాణికుల్ని గుర్తించామని పేర్కొన్నారు. 560 మంది ఇళ్లలోనే  వైద్యుల పరిశీలనలో ఉన్నారని.. 250 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయ్యిందని వెల్లడించారు. 30 మంది ఆసుపత్రిలో  వైద్యుల పరిశీలనలో ఉన్నారని చెప్పారు. 92 మంది నమూనాలను ల్యాబ్ కు పంపగా 75 మందికి నెగిటివ్ వచ్చిందని.. 16 మంది శాంపిల్స్‌కు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు వ్యాధి లక్షణాలున్నా..లేకపోయినా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. (ఆసుపత్రి నుంచి కరోనా అనుమానితుడి పరార్‌!)

విజయవాడ సిద్ధార్థ మెడికల్‌ కళాశాలలో కరోనా టెస్టింగ్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. వైరస్‌ను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అంటువ్యాధుల చట్టం-1897ను నోటిఫై చేశామని.. దీంతో జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖాధికారులకు మరిన్ని అధికారాలు కల్పించామని తెలిపారు. కరోనా వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు ( 0866-2410978)కి తెలియజేయాలన్నారు. వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలని తెలిపారు.
(కరోనాపై తప్పుడు ప్రచారం.. ముగ్గురి అరెస్టు) 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు