బోటు ప్రమాదాలు జరగకుండా కఠిన నిబంధనలు

3 Oct, 2019 21:03 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : భవిష్యత్తులో బోటు ప్రమాదాలు జరగకుండా కఠినమైన నిబంధనలు అమలు చేస్తామని మంత్రి అవంతీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం బోటు ప్రమాదంలో మరణించిన విశాఖపట్నం, అనకాపల్లి, పెందుర్తి, గోపాలపట్నం, మహారాణిపేటలకు చెందిన తొమ్మిది కుటుంబాలకు రూ.10 లక్షల చెక్‌లను మంత్రి పంపిణి చేశారు. ఈ కార్యక్రమానికి గుడివాడ అమర్‌ నాథ్‌, ధర్మశ్రీ, అదీప్‌ రాజ్‌, తిప్పల నాగిరెడ్డి ఎమ్మెల్యేలతో పాటు కలేక్టర్‌ వినయ్‌ చంద్‌, విఎం చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ తదితరులు హాజరయ్యారు. చెక్కుల పంపిణీ అనంతరం మంత్రి అవంతి మీడియాతో మాట్లాడుతూ.. తూర్పుగోదావరి జిల్లాలో బోటు ప్రమాదం జరగటం చాలా దురదృష్టకరమని, మృతిచెందిన వారిలో విశాఖ జిల్లాకు చెందిన వారు 17మంది ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబసభ్యులకు రూ. 10 లక్షల చొప్పున రూ. 90 లక్షలు ఎక్సగ్రేషియా అందించామని పేర్కొన్నారు.

అలాగే బోటును బయటకు తీయడానికి అన్నివిధాల ప్రయత్నాలు చేస్తున్నామని, బోటు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, ఉద్యోగాలు ఇవ్వడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. రాబోయే రోజులలో బోటు ప్రయాణాలపై నిర్థిష్ట ప్రమాణాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. బోటు ప్రమాద ఘటనపై ప్రభుత్వం నియమించిన కమిటీ త్వరలోనే నివేదిక ఇవ్వనున్నదని మంత్రి వెల్లడించారు.

మరిన్ని వార్తలు