నారాయణ, చైతన్య కాలేజీలకు భారీ జరిమానా: గంటా

29 Nov, 2017 15:41 IST|Sakshi

విద్యాసంస్థల్లో ఒత్తిడులు నిజమే

మంత్రి గంటా స్పష్టం

సాక్షి, అమరావతి: విద్యా సంస్థల్లో తీవ్ర ఒత్తిడి ఉంటున్న మాట వాస్తవమేనని విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. నిబంధనలు పాటించని పలు జిల్లాల్లోని నారాయణ, చైతన్య కాలేజీలకు రూ. 50 లక్షల చొప్పున జరిమానా విధించామని.. తగిన చర్యలు తీసుకుంటున్నామని అసెంబ్లీలో చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి అన్ని కళాశాలల్లో పూర్తిస్థాయిలో నిబంధనలు అమలు చేస్తామన్నారు. లోటు బడ్జెట్‌లోనూ విద్యారంగానికి అధిక నిధులు ఖర్చు పెడుతున్నామని చెప్పారు.

ప్రైవేటు కళాశాలల్లో ఆత్మహత్యల నివారణకు రెండు కమిటీలు వేశామని వెల్లడించారు. రోజుకు 18 గంటలపాటు  విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని, ఆత్మహత్యల నివారణ కోసం సీఎం స్వయంగా యాజమాన్యాలతో చర్చించారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావద్దని హెచ్చరించారని వివరించారు. ఒక్క ఏపీలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయని, కచ్చితంగా ఆత్మహత్యలు తగ్గిస్తామని, వచ్చే ఏడాది నుంచి 100 శాతం నిబంధనలు పాటించే కళాశాలలకే అనుమతులిస్తామని మంత్రి చెప్పారు.
 

మరిన్ని వార్తలు