‘సహకార రంగాన్ని బాబు పూర్తిగా నాశనం చేశారు’

19 Nov, 2019 20:35 IST|Sakshi

సాక్షి, విజయవాడ: సహకార రంగం బతికి బట్టకట్టింది అంటే కేవలం అది దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వలనే అని మంత్రి పేర్ని నాని ప్రశంసించారు. తండ్రి అడుగు జాడల్లోనే కోపరేటివ్‌ రంగాన్ని బలపరిచే విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటున్నారని పేర్కొన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌,  విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తదితర నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో సహకార రంగం పూర్తిగా నాశనమైందని విమర్శించారు. అనంతరం  వైఎస్సార్‌ అధికారంలోకి వచ్చాక సహకార రంగం ఊపిరి పోసుకుందన్నారు. కోపరేటివ్‌ రంగాన్ని బలపరిచేవిధంగా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఉంటుందన్నారు. సహకార రంగ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇస్తూ.. ఉద్యోగుల నమ్మకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ కాపాడతారని మంత్రి పేర్ని నాని అన్నారు. 

ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ రైతు పక్షపాతి అని అభివర్ణించారు. బ్యాంకింగ్‌, సహకార వ్యవస్థను ముఖ్యమంత్రి బలోపేతం దిశగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉంటుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ భరోసా ఇచ్చారు.  

గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో సహకార సంఘం కుదేలయిందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. అయితే సహకార రంగంలో రెండంచెల విధానాన్ని వైఎస్సార్‌ తీసుకొచ్చారని గుర్తుచేశారు. సహకార రంగాన్ని వైఎస్సార్‌ ముందుండి నడిపించారని, అదేవిధంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చారన్నారు. ప్రస్తుతం సీఎం వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలో వ్యవసాయ రంగం మరింత ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆకాంక్షించారు.  

మరిన్ని వార్తలు