అప్రమత్తతతోనే ముప్పు తప్పింది 

9 May, 2020 05:01 IST|Sakshi

ఎల్‌జీ పాలిమర్స్‌ దుర్ఘటనలో 554 మందికి చికిత్స 

వీరిలో 128 మంది డిశ్చార్జి     

విష వాయువు ప్రమాద స్థాయి తగ్గింది 

ప్రజలెవరూ ఆందోళన చెందొద్దు 

మంత్రులు.. ఆళ్ల నాని, మేకపాటి గౌతమ్‌రెడ్డి, ముత్తంశెట్టి శ్రీనివాస్‌ 

సాక్షి, విశాఖపట్నం/మహారాణిపేట (విశాఖ దక్షిణ)/విశాఖపట్నం/ఎన్‌ఏడీ జంక్షన్‌ (విశాఖ)/పాత పోస్టాఫీసు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో జిల్లా యంత్రాంగమంతా అప్రమత్తమై తక్షణ చర్యలు తీసుకున్న కారణంగానే ఎల్‌జీ పాలిమర్స్‌ దుర్ఘటన నుంచి బయటపడగలిగామని మంత్రులు.. ఆళ్ల నాని, ముత్తంశెట్టి శ్రీనివాస్, మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఆళ్ల నాని శుక్రవారం విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 554 మందిలో 128 మందిని డిశ్చార్జి చేశామని తెలిపారు. 305 మంది కేజీహెచ్‌లో చికిత్స పొందుతుండగా, మరో 121 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని, ఎవరికీ ప్రాణాపాయం లేదని స్పష్టం చేశారు. సీఎం ప్రకటించిన పరిహారాన్ని త్వరలోనే అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు.. బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, ధర్మాన కృష్ణదాస్, గుమ్మనూరు జయరాం, ఎంపీ భీశెట్టి సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్, జేసీ శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.  

 పరిశీలించాకే అనుమతులు: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి 
సంఘటన జరిగిన ప్రాంతంలో ప్రస్తుతం విషవాయువు ప్రమాద స్థాయి తగ్గిందని.. మరో 48 గంటల నుంచి 72 గంటల్లో సాధారణ స్థితికి రావచ్చని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమకు వచ్చిన ఆయన సంస్థ అధికారులతో మాట్లాడారు. తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి.. పరిస్థితిని సాధారణ స్థితికి తేవడానికి అవసరమైన మెటీరియల్‌ వచ్చిందన్నారు. బాధ్యులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎల్జీ పాలిమర్స్‌ లాంటి 86 కంపెనీలను గుర్తించామని, వీటన్నింటిలో భద్రతా ప్రమాణాలు పరిశీలించాకే పున:ప్రారంభానికి అనుమతిస్తామన్నారు. కాగా ప్రజలెవ్వరూ ఆందోళన చెందవద్దని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌ అన్నారు.

చంద్రబాబూ.. చౌకబారు రాజకీయాలు మానుకో: మంత్రి బొత్స ఆగ్రహం 
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖ కలెక్టరేట్‌లో శుక్రవారం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారంపై ప్రతిపక్షాలతో సహా అన్ని వర్గాలు హర్షిస్తున్నాయని, చంద్రబాబు అండ్‌ కో మాత్రం ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీకి తాము అనుమతులు ఇచ్చినట్లు రుజువు చేయాలని సవాల్‌ విసిరారు. 

>
మరిన్ని వార్తలు