వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తాం : ఆళ్ల నాని

3 Apr, 2020 19:28 IST|Sakshi

సాక్షి, విజయవాడ : కరోనా వైరస్‌ కట్టడికి సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలిపారు. అందరి సహకారంతోనే కరోనాను కట్టడి చేయవచ్చని అన్నారు. అత్యవసర సర్వీసుల్లో ఉన్న సిబ్బందికి అన్ని సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వారికి అవసరమైన పరికరాలు సమకూర్చుతున్నట్టు చెప్పారు. ఏప్రిల్‌ 10లోగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వాటిని అందజేస్తామన్నారు. కరోనా నివారణ చర్యలకు సంబంధించి చర్చించేందుకు శుక్రవారం విజయవాడలోని ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌లో మంత్రుల కమిటీ సమావేశం అయింది. 

అనంతరం ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ..  కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో డోర్‌ టూ డోర్‌ సర్వే చేస్తున్నామని తెలిపారు. క్వారంటైన్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్టుగా చెప్పారు. లాక్‌డౌన్‌లో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని అన్నారు. ఏప్రిల్‌ 14 వరకు ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని కోరారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. 

గ్రామ స్థాయిలోనే ధాన్యం కొనుగోళ్లు : మంత్రి కన్నబాబు
వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు నిబంధనలు సరళీకృతం చేసినట్టు వెల్లడించారు. గ్రామ స్థాయిలోనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించునున్నట్టు తెలిపారు. ఏప్రిల్‌ 10 నుంచి గ్రామాల్లోనే ధాన్యం కొనుగోళ్లు జరపనున్నట్టు చెప్పారు. అరటి, టమాట పంటలను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. జొన్న, మొక్కజొన్న, పసుపు కొనుగోళ్లకు కూడా చర్యలు చెప్పినట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు