8,500 కోట్లతో గోదావరి జిల్లాలకు వాటర్‌ గ్రిడ్

10 Sep, 2019 17:59 IST|Sakshi

వాటర్ గ్రిడ్ విధివిధానాలపై మంత్రుల సమీక్ష

సాక్షి, తూర్పుగోదావరి:  ఉభయగోదావరి జిల్లాలకు రక్షిత మంచినీటిని అందించేందుకు రూ. 8,500 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకం చేపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. వాటర్ గ్రిడ్ విధివిధానాలపై చర్చించేందుకు ఉభయగోదావరి జిల్లాల మంత్రులు మంగళవారం రాజమండ్రిలో కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రెండు జిల్లాల ప్రజలకు రక్షిత మంచినీరు అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ సంకల్పమని డిప్యూటీ సీఎం సుభాష్‌ చంద్రబోస్‌ పేర్కొన్నారు. నిర్ణీత సమయంలోగా వాటర్ గ్రిడ్ పూర్తయ్యాలా చర్యలు తీసుకోవాలని.. వాటర్ గ్రిడ్  అమలులో పూర్తి  బాధ్యత అధికారులదేనని తెలిపారు. గత ప్రభుత్వం ఈ పథకానికి కన్సల్టెన్సీల పేరుతో  రూ.38 కోట్లు వృధా చేసిందని విమర్శించారు. అనుభవజ్ఞులైన అధికారులతో వాటర్ గ్రిడ్  పనులు సమర్ధవంతంగా చేపడతామని వెల్లడించారు. 2051 సంవత్సరం వరకూ సరిపడేలా స్వచ్ఛ మైన గోదావరి జలాలు అందించడమే లక్ష్యంగా పలు అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. తొలిదశలో రాష్ట్రంలోని మొత్తం తొమ్మిది జిల్లాలకు డ్రింకింగ్‌ వాటర్‌ గ్రిడ్‌ నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ సమావేశంలో మంత్రులు ఆళ్ల నాని, పిల్లి సుభాష్‌ చంద్రబాబోస్‌, కన్నబాబు, తానేటి వనిత, విశ్వరూప్‌, ఎంపీలు మార్గాని భరత్, వంగా గీత, అనురాధ, జక్కంపూడి రాజా, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు మురళీధర్‌రెడ్డి, ముత్యాలరాజు,  ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వరద బాధితులను అన్ని విధాల ఆదుకుంటాం..
వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఉప ముఖ్యమంత్రి సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపారు. బాధిత కుటుంబానికి పది కేజీల వంతున బియ్యం పంపిణీ చేస్తామని వెల్లడించారు. బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముమ్మర సహాయక చర్యలు చేపట్టిందన్నారు.

మరిన్ని వార్తలు