‘వచ్చారు జగన్‌.. మెచ్చారు జనం’

9 Jan, 2020 13:39 IST|Sakshi

‘జగనన్న అమ్మఒడి’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు

సాక్షి, చిత్తూరు: బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ భావజాలంతో పనిచేస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన ‘జగనన్న అమ్మఒడి’పథకం ప్రారంభోత్సవంలో సీఎం వైఎస్‌ జగన్‌తో కలిసి పాల్గొన్న మంత్రి అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అమ్మ ఒడి పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు. అక్షర సేద్యం చేస్తున్న విద్యా శ్రామికుడు, నిత్య కృషీవలుడు సీఎం జగన్‌ అంటూ అభివర్ణించారు. ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..  

‘ప్రపంచ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖింపబడ్డ రోజు ఇది. చదువుకు పేదరికం అడ్డుకాకూడదని, ఈ రోజు అక్షర సేద్యం చేస్తున్న శ్రామికుడు సీఎం వైఎస్‌ జగన్‌ అని గర్వంగా చెబుతున్నాను. ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. ఎన్ని విమర్శలు చేసినా.. తాను నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మిన వ్యక్తుల కోసం పోరాటం చేస్తున్నారు. అలాంటి పోరాటయోదుడికి సైనికులుగా నిలబడ్డాం. చదువులు చెప్పే విద్యాశాఖకు దళితుడినైన నన్ను చేయడం గొప్ప విషయం. జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటా. రావాలి జగన్‌..కావాలి జగన్‌ అని నాడు నినాదాలు ఇచ్చాం. నేడు వచ్చారు జగన్‌.. మెచ్చారు జనం అని అందరూ అంటున్నారు. అంబేద్కర్‌ భావాజాలం..వైయస్‌ఆర్‌ రూపకల్పనే జగనన్న అమ్మ ఒడి. జనమంటే జగన్‌..జగన్‌ అంటే జనం అంటూ నినదించారు’అంటూ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రసంగించారు. 


రాజధానిపై కావాలని రాద్ధాంతం చేస్తున్నారు..
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని సీఎం జగన్‌ అమలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశంసించారు. ‘జగనన్న అమ్మఒడి’పథకం ప్రారంభోత్సవంలో భాగంగా సీఎం జగన్‌తో కలిసి పాల్గొన్న మంత్రి ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. నవరత్నాల్లో భాగంగా ఇప్పటివరకు ఏడు పథకాలను అమలు చేశామని,  అమ్మ ఒడితో ఎనిమిదో పథకానికి నాంది పలికామని పేర్కొన్నారు. ఉగాది రోజు తొమ్మిదో పథకానికి శ్రీకారం చుట్టడంతో మొత్తం నవరత్న పథకాలు పూర్తవుతాయని అన్నారు. ఈ సందర్భంగా చిత్తూరులో అమ్మఒడిని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఇక రాజధానిపై టీడీపీ నేతలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు..

‘మేనిఫెస్టో లో పొందు పరిచిన అన్ని అంశాలను సీఎం జగన్ 80 శాతం నెరవేర్చారు. నా రాజకీయ జీవితంలో  జగన్ లాంటి సీఎంను చూడలేదు. 6నెలల్లో 80శాతం హామీలు నెరవేర్చారు. మాజీ సీఎం లు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి లు ఏనాడు ఇచ్చిన హామీలు గుర్తుకు రాలేదు. రాజధాని పేరుతో చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారు. రాష్ట్రంలో అన్నిప్రాంతాలు అభివృద్ధి చేయాలి అని సీఎం సంకల్పిస్తున్నారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈ హడావుడి చేస్తున్నారు. రాయలసీమ వాసుల  40 ఏళ్ల చిరకాల స్వప్నం హైకోర్టు ఏర్పాటు సీఎం వైఎస్ జగన్ తీర్చారు. మా ఎమ్మెల్యే లపై దాడులు చేస్తున్నారు. మా మీద దాడులు ఆపక పోతే మా పార్టీ శ్రేణులు చూస్తూ ఊరుకోరు. రాష్ట్రంలో  చంద్రబాబును ఎక్కడా తిరగనివ్వం. మా నాయకులపై దాడి చేస్తే.. అదే తరహాలో సమాధానం చెప్తాం. ఉత్తరాంద్ర అభివృద్ధి చేస్తే చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏంటి?’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు.  

మరిన్ని వార్తలు