ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టిన పీఆర్సీ

21 May, 2018 16:50 IST|Sakshi
అశోక్‌బాబు, బొప్పరాజు వెంకటేశ్వర్లు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగ సంఘాల మధ్య 11వ వేతన సవరణ కమిషన్‌ (పీఆర్సీ) ఉత్తర్వులు చిచ్చుపెట్టాయి. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సిఫార్సుల సమర్పణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీను ఏర్పాటు చేసింది. అన్ని అంశాలను పరిశీలించి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఆర్థిక నిపుణులతో చర్చించి ఏడాదిలోగా వేతన సవరణపై సిఫారసులను ప్రభుత్వానికి సమర్పించాలని పీఆర్సీని ఆదేశించినట్లు పేర్కొంటూ ప్రభుత్వం శుక్రవారం (మే 18) ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త వేతన సవరణ సిఫారసుల కోసం తక్షణమే 11వ పీఆర్సీని ఏర్పాటు చేయాలంటూ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (అమరావతి జేఏసీ) సమర్పించిన వినతిపత్రాన్ని పరిగణనలోకి తీసుకుని కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ ఉత్తర్వుల్లో పేర్కొనడంతో ఉద్యోగ సంఘాల మధ్య వివాదం నెలకొంది.

అశోక్‌బాబు వర్సెస్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు

ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలో ఏపీఏన్జీవో, సచివాలయ ఉద్యోగల సంఘాలను ప్రస్తావించక పోవడంపై ఎన్జీవో నేత అశోక్‌ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సంఘాలను ఎందుకు పెట్టలేదని అశోక్‌ బాబు వర్గం మండిపడుతోంది. ఈ నేపథ్యంలో సీఎం కార్యాలయంలో ముఖ్యకార్యదర్శి సతీష్ చంద్రతో సోమవారం అశోక్‌బాబు నేతృత్వంలోని ప్రతినిధులు భేటీ అయ్యారు. జీవోలో తమ సంఘాలను ఎందుకు చేర్చలేదని వారు ప్రశ్నించారు. అయితే పీఆర్సీని నియమించమని వినతిపత్రం ఇవ్వలేనందునే ఏపీఎన్జీవోలో పేర్లు చేర్చలేదని సీఎం వర్గాలు తెలిపా​యి. తాజా వివాదంతో అశోక్‌బాబు వర్సెస్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లుగా వ్యవహారం మారిపోయింది.

మరిన్ని వార్తలు