సభకొచ్చేవారికి పాసులు

5 Sep, 2013 03:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరిట సీమాంధ్ర ఉద్యోగులు శనివారం ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న సభను విజయవంతం చేయడానికి ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ సభకు జంటనగరాల్లోని ప్రజలు, ఐటీ, ప్రైవేటు ఉద్యోగులను కూడా ఆహ్వానించారు. సభకు వచ్చే వారికి ప్రత్యేకంగా రూపొందించిన గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. అయితే, ఉద్యోగులనే సభకు అనుమతిస్తామని పోలీసులు షరతు విధించారు. దీంతో.. సభ ఉద్యోగుల అంశాలకే పరిమితం కాదని, అన్ని వర్గాల ప్రజలను అనుమతించాలని పోలీసులను కోరాలని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక సమన్వయ సంఘం నిర్ణయించింది. ఇందుకోసం సంఘం ప్రతినిధులు గురువారం పోలీస్ కమిషనర్‌ను కలిసే అవకాశముంది. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం ఎల్బీ స్టేడియానికి వెళ్లి స్టేడియం వైశాల్యం, సామర్థ్యం, ఇతర అంశాలను పరిశీలించింది. క్రికెట్ మ్యాచ్‌లకు వీఐపీ టిక్కెట్లు కాకుండా 39 వేల టిక్కెట్లు విక్రయిస్తామని స్టేడియం నిర్వాహకులు చెప్పారు. బహిరంగ సభ అయితే 50 వేల మందికిపైగానే పడతారని అంచనా వేశారు. ఏపీఎన్జీవో నగర శాఖ అధ్యక్షుడు సత్యనారాయణ, ఇతర నేతలు నగరంలోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతో బుధవారం సమావేశమయ్యారు. సభకు వీలైనంత ఎక్కువ మంది వచ్చేలా ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇతర సామాజిక మీడియా ద్వారా ప్రచారం చేయాలని కోరారు.
 
 అశోక్‌బాబుతో గజ్జెల కాంతం భేటీ
 తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం బుధవారం ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబుతో భేటీ అయ్యారు. అనంతరం అశోక్‌బాబుతో కలిసి కాంతం విలేకరులతో మాట్లాడుతూ.. శుక్రవారం నిర్వహించనున్న ఇరు ప్రాంతాల ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశానికి ఏపీఎన్జీవోలను ఆహ్వానించడానికి వచ్చానని తెలిపారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు తనను పిలిస్తే హాజరవుతానని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీనికి అశోక్‌బాబు స్పందిస్తూ.. ‘తప్పకుండా ఆహ్వానిస్తాం. ఆయన వ్యక్తిగా కాకుండా వ్యవస్థ ప్రతినిధిగా హాజరుకావొచ్చు’ అని అన్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైనా ఇక్కడ పనిచేసే విద్యార్థులు, ఉద్యోగులతో కలిసే ఉంటామని కాంతం చెప్పారు. ప్రజాస్వామ్యంలో సభలు నిర్వహించుకునే హక్కు  అందరికీ ఉందని, ఏ ఉద్యమాన్నీ కించపరచవద్దని అన్నారు. సమస్యలుంటే సామరస్యపూరిత వాతావరణంలో చర్చించుకుని పరిష్కరించుకోవాలని, శాంతియుతంగా ఉండాలన్న ఆలోచనతోనే రౌండ్ టేబుల్ సమావేశానికి సమైక్యాంధ్ర ఉద్యోగ సంఘాలను కూడా ఆహ్వానిస్తున్నామని తెలిపారు.
 
 మాకు సహకరిస్తేనే...: అశోక్‌బాబు
 సభకు ఆటంకం కలిగించవద్దని తెలంగాణవాదులను అశోక్‌బాబు కోరారు. ఈ సభకు వారు సహకరిస్తే వారికి సహరించే ఆలోచన తమకు కలుగుతుందన్నారు. సమైక్యవాదాన్ని బలపరిచే వారు ఎవరైనా ఈ సభకు ఆహ్వానితులేనన్నారు. సభకు ఆటంకం కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమైక్యాంద్ర విషయంలో అన్ని పార్టీలు ద్వంద్వ వైఖరులు అవలంభిస్తున్నందున ఈ సభకు సీపీఎం, ఎంఐఎం పార్టీలనే ఆహ్వానించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు