అధికారులే ఆత్మబంధువులయ్యారు..

14 Jun, 2015 12:13 IST|Sakshi
అధికారులే ఆత్మబంధువులయ్యారు..

మానవత్వం పరిమళించింది. అభం శుభం తెలియని ఈగల అప్పారావు కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఖననం చేసేందుకు అధికారులే కుటుంబ సభ్యులు పాత్ర పోషించారు. ఒక్కసారిగా ఒకే కుటుంబానికి చెందిన 23మంది మోసయ్యపేట గ్రామస్తులు వాహనం బోల్తా సంఘటనలో మృతి చెందడంతో ఆయా మృతదేహాలకు ఖననం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం ముందుకు వచ్చి అన్ని బాధ్యతలు చేపట్టింది.
 
 మునగపాక :
 మునుపెన్నడూ లేనివిధంగా ఒకే కుటుంబానికి చెందిన 23 మందిని ఖననం చేసేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. అయితే ఖర్మకాండలు నిర్వహించేందుకు ఇతర గ్రామాలనుంచి కాటికాపరులను తీసుకువచ్చి కార్యక్రమం నిర్వహించారు. ఆర్‌డీఓ పద్మావతి, విశాఖ రూరల్ ఎస్‌పి కోయ ప్రవీణ్, జేసీ నివాస్‌లు  ఈ ఖననం కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. సాధారణంగా ఒక వ్యక్తి మృతిచెందితే ఆయా కుటుంబానికి చెందిన వ్యక్తులు ఖర్మకాండలు చేయాల్సి ఉంటుంది. అయితే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఈగల అప్పారావు కుటుంబ సభ్యులకు మాత్రం పలు శాఖల అధికారులు ఈ తతంగాన్ని పూర్తి చేశారు. దీనికి తోడు కాటికాపరులను ఎంజెపురం, వెదురువాడ, వాడపాలెం, అచ్చుతాపురం తదితర ప్రాంతాలనుంచి తీసుకువచ్చి చిన్నపిల్లలను పూడ్చి వేయడంతోపాటు ఇతరులను ఖననం చేయించారు. అచ్యుతాపురం ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఇన్‌చార్జి తహశీల్దార్ భాస్కరరావు, పలువురు పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. అంత్యక్రియలకు ఇతర ప్రాంతాలనుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అక్కడంతా హృదయ విదారకర దృశ్యాలు కనిపించాయి.
 మృతులకు మంత్రుల నివాళులు
 విశాఖపట్నం సిటీ : అచ్యుతాపురం మండలం మోసాయిపేట గ్రామ మృతులకు జిల్లా మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. రాజమండ్రి నుంచి మోసాయిపేటకు మూడు వాహనాల్లో మృత దేహాలను తీసుకొచ్చారు. జాయింట్ కలెక్టర్ నివాస్ ఆదేశాల మేరకు అనకాపల్లి ఆర్డీఓ పద్మావతి మృతుల దహన సంస్కారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, ఎస్‌పీ కోయ ప్రవీణ్, జాయింట్ కలెక్టర్ నివాస్ తదితరులంతా దగ్గరుండి మృతుల అంత్యక్రియలు పూర్తి చేశారు.

 కలివిడి మనస్తత్వం
 ప్రసాద్ అన్ని పనుల్లోను తండ్రికి తోడుగా ఉంటున్నాడు. ఇది వరకు ట్రాన్స్‌పోర్టు సర్వీస్ చేసేవాడు. ఇటీవల పొయినీర్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అందరితో కలిసిపోయే మనస్తత్వం. ఇంతలోనే ఇంత దారుణం జరగడం మమ్మల్ని కలచివేసింది.
 -కె.వెంకట్రావు, ప్రసాద్ స్నేహితుడు


 ఎంతోమందికి దారిచూపాడు..
 అప్పారావు డ్రైవర్‌అప్పారావుగా ఈ ప్రాంతంలో పేరుంది. అతని చేతిలో ఎంతో మంది డ్రైవర్లు తయార య్యారు. దేశంలో చాలా ప్రాంతాలు తిరిగాడు. మావూరులో ఆయన్ని చూసి చాలామండి మోటారు ఫీల్డ్‌లోకి వెళ్లారు. చాలామందికి దారిచూపించాడు. ఆకుటుంబానికి చాలా అన్యాయం జరిగింది.
 - పంచదార్ల రాంబాబు, గ్రామపెద్ద కొత్త మోసయ్యపేట


 అందరి బంధువు..
 కనక వల్లనే ఆ కుటుంబం నిలబడింది. కనక తన ఐదుగురు చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేసింది. గ్రామంలో ఏ శుభకార్యమైనా ఆమె ఉంటుంది. అందరూ కావాలనుకునే మనస్తత్వం. పిల్లల్ని బాగా చవించింది. భార్యభర్తలు ఒక్కమాట మీద ఉండి కుటుంబాన్ని నిలబెట్టారు. అంతా బాగుంది అన్నపుడు వారే లేకుండా పోయారు.
 -అప్పికొండ ఈశ్వరరమ్మ  గ్రామస్తురాలు, మోసయ్యపేట
 

ఇంతఘోరం ఎప్పుడూ చూడలేదు...
 అందర్నీ చేరదీశారు. పిల్లలు ఉద్యోగాలు చేస్తే చూడాలనుకున్నారు. చదువంటే మహాఇష్టం. మనవలు, మనవరాళ్లను కూడా బాగా చదివించాలని అనుకునేవారు. కుటుంబం మొత్తమే తుడిచిపెట్టుకుపోయారు. ఇది చాలా బాధాకం.
 -గొలగాని అమ్మాజి, అచ్యుతాపురం బంధువు

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega