రోగుల ఏడాది జేబు ఖర్చు రూ.15,711 కోట్లు

19 Sep, 2019 03:56 IST|Sakshi

మా సిఫార్సులు అమలుకు మొత్తం రూ.14 వేల కోట్లు అవసరం నిపుణుల కమిటీ అధ్యక్షురాలు సుజాతారావు వెల్లడి

సాక్షి, అమరావతి: సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం, ఉన్నా సకాలంలో వైద్య సేవలు అందించలేకపోవడం వంటి కారణాలతో ఆంధ్రప్రదేశ్‌లో రోగులకు జేబు ఖర్చు (ఔట్‌ ఆఫ్‌ పాకెట్‌ ఎక్స్‌పెండిచర్‌) ఏడాదికి రూ.15,711 కోట్లు అవుతోందని ఆరోగ్య శాఖలో సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ అధ్యక్షురాలు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సుజాతారావు చెప్పారు. ఎక్కువగా మందులకు, వ్యాధి నిర్ధారణ పరీక్షలకు డబ్బు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి 182 పేజీల నివేదిక అందించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో అసాంక్రమిక వ్యాధులు (నాన్‌ కమ్యునికబుల్‌ డిసీజెస్‌) అంటే గుండెజబ్బులు, క్యాన్సర్, హైపర్‌ టెన్షన్, మధుమేహం వంటి వాటితో సగటు ఆయుర్ధాయానికి ముందే 65 శాతం మంది మృతి చెందుతున్నారని పేర్కొన్నారు. సగటు ఆయుర్దాయం రాష్ట్రంలో 72 సంవత్సరాలుండగా, వ్యాధుల పీడితులు 68 ఏళ్లలోపే మృతి చెందుతున్నారని చెప్పారు. జీవనశైలి జబ్బులు చాపకింద నీరులా విస్తరించి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని తెలిపారు. తమ నివేదికలో పొందుపరిచిన అంశాలు, ప్రభుత్వానికి చేసిన సిఫార్సులపై సుజాతారావు వివరించారు.
- రాష్ట్రంలో కొత్తగా హెచ్‌ఐవీ కేసులు నమోదవుతూనే ఉన్నాయి.  
రాష్ట్రంలో పది లక్షల కుటుంబాలు ఆరోగ్య సమస్యల కారణంగా ఆర్థికంగా చితికిపోయాయి. 
రాష్ట్రంలో గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ ఏర్పాటు చేస్తే రోగులకు ఖర్చు తగ్గించవచ్చు. 
రాష్ట్రంలో 18 ఏళ్లలోపు వారు 93 లక్షల మంది ఉండగా, వీరిలో 40 శాతం మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. 27 శాతం మంది అమ్మాయిలు హింసకు గురవుతున్నారు. 
రూ.లక్ష వేతనం తీసుకునే కంటి వైద్యుడు ఏడాదిలో ఒక్క సర్జరీ కూడా చేయని ఘటనలు ఎదురయ్యాయి. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలి. 
మన వైద్య వ్యవస్థలో పర్యవేక్షణ అసలే లేదు. ఏ ఆస్పత్రిలో ఎవరూ బాధ్యత వహించడం లేదు. అందుకే ఏ ఆస్పత్రిలో ఏం జరుగుతోందో అదే రోజు సాయంత్రానికి నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకునే బాధ్యత సూపరింటెండెంట్‌కు అప్పజెప్పాలి. 
మేము ఇచ్చిన సిఫార్సులు అమలు చేసేందుకు రూ.14 వేల కోట్లు అవసరమని అంచనా వేశాం. ఇందులో వైద్య పరికరాలకే రూ.11 వేల కోట్లు అవుతుందని అంచనా.  

మరిన్ని వార్తలు