వర్ల రామయ్య విజ్ఞతకే వదిలేస్తున్నాం...

16 Oct, 2019 18:44 IST|Sakshi

సాక్షి, విజయవాడ: పోలీసులపై టీడీపీ నేత వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలను ఏపీ పోలీస్‌ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. పోలీస్‌ అనేది ఒక వ్యవస్థ అని ఎవరైనా చట్టానికి లోబడే పని చేస్తారని స్పష్టం చేసింది. బుధవారం ఏపీ పోలీస్‌ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి మస్తాన్‌ మాట్లాడుతూ...‘ వర్ల రామయ్యపై పోలీస్‌ ఉద్యోగిగా మాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. పోలీసుల జాతకాలు తెలుసు, ఒక జెండా పట్టుకున్నారని టీడీపీ నేతలు కించపరిచేలా మాట్లాడారు. ఇటువంటి వ్యాఖ్యలను వర్ల రామయ్య ఎందుకు సమర్థిస్తున్నారు. ఖండించాల్సిన ఆయన డీజీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. పోలీసులు చట్టానికి లోబడే పనిచేస్తారు. 

మా శాఖలో పని చేసిన మీకు ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మా సంఘంలో పని చేసిన అనుభవం కూడా రామయ్యకు ఉంది. మా మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే...ఖండించడం తప్పా?. పోలీసులకు కులం, మతం లేవు. మా అందరిదీ ఖాకీ కులమే. పోలీస్‌ శాఖను కించపరిచేలా ఎవరు మాట్లాడినా సహించం. పోలీస్‌ సంఘంలో మనుషులు మారారేమో...విధానాలు మారలేదు. వర్ల రామయ్య కేసుపెట్టి ఉంటే.. ఆ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో చట్టప్రకారం వెళతారు. పోలీసుల జాతకాలు నా దగ్గర ఉన్నాయని బెదిరించడాన్ని వర్ల రామయ్య విజ్ఞతకే వదిలేస్తున్నాం.’ అని అన్నారు.

ఏపీ పోలీస్‌ అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలు స్వర్ణలత మాట్లాడుతూ... వర్ల రామయ‍్య పోలీస్‌ వ్యవస్థను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. పోలీస్‌గా, సంఘం సభ్యుడిగా పనిచేసిన ఆయనకు వ్యవస్థ ఎలా ఉంటుందో తెలియదా అని సూటిగా ప్రశ్నించారు. పోలీస్‌ శాఖలో కులాన్ని తీసుకు వస్తున్నారని, అది సరికాదని అన్నారు. పోలీసుల సంఘానికి ప్రెస్‌మీట్‌ పెట్టే అర్హత ఎందుకు లేదో ఆయనే చెప్పాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్‌లో ఎవరు పోలీస్‌ శాఖపై విమర్శలు చేసినా సహించేది లేదన్నారు. 

విజయవాడ పోలీసు అధికారులు సంఘం అధ్యక్షుడు సోమయ్య మాట్లాడుతూ.. ఇప్పుడు కులం పేరు చెప్పుకుంటున్న వర్ల రామయ్య ఏనాడైనా దళితులకు న్యాయం చేశారా అని ప్రశ్నలు సంధించారు. ఆర్టీసీ చైర్మన్‌ హోదాలో దళిత విద్యార్థులను అవమానించిన చరిత్ర ఆయనది అని గుర్తు చేశారు. రాజకీయ నేతగా మీరు దళితుల ఎదుగుదలకు ఎప్పుడైనా ప్రోత్సహించారా అంటూ డీజీపీపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

‘నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు.. పులిని‌ చూసి నక్క‌ వాత పెట్టుకున్నట్లుగా నేను‌ చేయను. మా పోలీసు వేదికపై నుంచి వర్ల రామయ్యకు అనేక సార్లు విజ్ఞప్తి చేశాం. మా శాఖలో పని‌చేసిన వ్యక్తి నోటికొచ్చినట్లు మాట్లాడితే మాకు ‌బాధ కలిగింది. మాది ఖాకీ కులమే తప్ప... మరే కులాలతో మాకు సంబంధం లేదు. వర్ల రామయ్యది ఏ కులమో కూడా మాకు తెలియదు. ఈ ఖాకీ డ్రెస్ వేసుకున్నందుకు ప్రాణ త్యాగానికైనా నేను సిద్దంగా ఉన్నాను’  అని ఏపీ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా