ఏపీ పోలీసుల సంచలన నిర్ణయం

2 Dec, 2019 17:38 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు సోమవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫిర్యాదులకు సంబంధించి.. "0" (జీరో) ఎఫ్‌ఐఆర్‌ అమలు చేయాలంటూ డీజీపీ  గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీచేశారు. ఇందుకు సంబంధించి వారం రోజుల్లో విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీ, ముంబై తరహాలో రాష్ట్రంలో జీరో ఎఫ్‌ఐఆర్‌ను అమలు చేయాలని సూచించారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ అమల్లో ఉంటే.. పోలీసు స్టేషన్‌ పరిధితో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోని పోలీసు స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేయవచ్చు. తమ పరిధి కాదంటూ పోలీసులు బాధితుల ఫిర్యాదును తిరస్కరించడానికి జీరో ఎఫ్‌ఐఆర్‌లో అవకాశముండదు. జీరో ఎఫ్‌ఐఆర్‌ పేరిట బాధితులు ఏ పోలీసు స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేస్తే.. దానిని స్వీకరించి.. విచారణ జరిపి.. సంఘటనా స్థలం పరిధిలో ఉన్న స్టేషన్‌కు ఫిర్యాదును పోలీసులు బదిలీ చేయాల్సి ఉంటుంది.

అంతకుముందు మంగళగిరిలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో గ్రామ, వార్డు మహిళా సంరక్షణ ట్రైనర్స్ వర్క్ షాప్‌ను ప్రారంభోత్సవంలోనే డీజీపీ గౌతం సవాంగ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.  గ్రామ సచివాలయాలకు అందే ఫిర్యాదులు పోలీసులకు అందేలా అనుసంధానం చేస్తున్నామని, జీరో ఎఫ్‌ఐఆర్‌ను కచ్చితంగా అమలుచేయాలని అన్ని జిల్లాల ఏస్పీలకు, పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చామని ఆయన వెల్లడించారు.

చదవండి: జీరో ఎఫైఆర్‌ను కచ్చితంగా అమలుచేయాలి
‘సున్నా’తో పరిధి సమస్య ఉండదు!
పరిధి పరేషాన్‌

మరిన్ని వార్తలు