'ఏపీలోనూ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్'

26 Sep, 2019 17:18 IST|Sakshi

సాక్షి, విజయవాడ: తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లో సైతం మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వెల్లడించారు. గురువారం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మైనార్టీల జీవన శైలిలో మార్పుకు కారణం దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని, మైనార్టీలకు పెద్ద పీట వేసేలా ఆయన పథకాలు ప్రవేశ పెట్టారని అన్నారు. పేద ప్రజలకు సంక్షేమం కోసం జగన్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మైనార్టీలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగానే పాస్టర్లకు 5 వేలు గౌరవ వేతనం, మౌజన్‌, పేషమామ్‌లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని 8 వేల నుంచి 15 వేలకు పెంచామని అన్నారు. అంతేకాక జెరుసలేం, హజ్ యాత్రకు వెళ్లే వారికి సైతం 3లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారిని పరిగణనలోకి తీసుకుని 60వేలు, ఆపైన వారికి 30వేలు ఆర్ధిక సహాయం అందజేస్తున్నామని తెలిపారు.

మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఇప్పటికే 80 శాతం నెరవేర్చామని ఆయన తెలిపారు. మైనార్టీ శాఖలో ఉన్న అన్ని శాఖలను ఒకే దగ్గరికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వమిచ్చే వైఎస్సార్ షాది-కా-తోఫాను 50 వేల నుంచి లక్షకు పెంచామని పేర్కొన్నారు. మైనార్టీ, క్రిస్టియన్‌లకు వైఎస్సార్ బీమా కింద 5 లక్షలు అందజేస్తున్నామని గుర్తుచేశారు. మైనార్టీ శాఖలో ప్రతి మూడు నెలలకు ఒకసారి రివ్యూ మీటింగ్ నిర్వహించి, సంక్షేమ పథకాలు అందరికీ చేరేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదటి క్యాబినేట్‌లోనే ఏపీ సీఎం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 60 శాతం పదవులు కేటాయించారని అన్నారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని అన్నారు. అధికారం చేపట్టిన నాలుగు నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని.. గ్రామ, వార్డు సచివాలయాలలో లక్షా 26 వేల శాశ్వత ఉద్యోగాలు కల్పించామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్స్, ఈడీలు, వివిధ విభాగాల హెచ్ఓడీలతో సమీక్షా సమావేశాలు నిర్వహించామన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలంటే విద్య చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకుగాను తెలంగాణ తరహాలోనే ఏపీలో సైతం రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి, విద్యార్థులకు హాస్టల్స్‌తో పాటు అన్ని వసతులు కల్పిస్తామని అన్నారు. 

మైనార్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎండీ ఇలియస్ రిజ్వీ, స్పెషల్ కమిషనర్‌ శారదాదేవి, మైనార్టీ కార్పొరేషన్ ఎండీ ఏసురత్నం, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు