ఏపీ సచివాలయ ఉద్యోగుల దుర్మరణం

18 Dec, 2018 01:17 IST|Sakshi

కోదాడ మండలం దోరకుంట వద్ద బోల్తాకొట్టిన కారు

ఇద్దరి మృతి.. డ్రైవర్‌ సహా మరో నలుగురికి తీవ్రగాయాలు

సెలవులకు వచ్చి వెళ్తుండగా ఘటన

కోదాడరూరల్‌(సూర్యాపేట): కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఏపీ సచివాలయ ఉద్యోగులు ఇద్దరు మృతిచెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని దోరకుంట శివారులో సోమవారం తెల్లవారుజామున ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథ నం మేరకు.. ఏపీ సచివాలయం సెక్షన్‌ ఆఫీసులోని జీఏడీ శాఖలో పనిచేస్తున్న టీకే హరికృష్ణ(54) రెవెన్యూ చీఫ్‌ సెక్రటరీకి పర్సనల్‌ సెక్రటరీ కొలిశెట్టి భాస్కర్‌రావు(52)తోపాటు మరో నలుగురికి హైదరాబాద్‌లో నివాసాలున్నాయి. వారాంతం కావడంతో శని, ఆదివారాలు కుటుంబ సభ్యులతో గడిపారు. ఉద్యోగ నిర్వహణ నిమిత్తం అమరావతికి కారులో సోమవారం ఉదయం 5:30 నిమిషాలకు బయలు దేరారు.

సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని దోరకుంట వద్దకు రాగానే మలుపును గమనించని డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేశాడు. దీంతో కారు అదుపుతప్పి మూడు ఫల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో టీకే హరికృష్ణ(54) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. కొలిశెట్టి భాస్కర్‌రావు(52) తీవ్రగాయాల పాలై కోదాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. సెక్షన్‌ ఆఫీసులోని ఎలక్షన్‌ విభాగంలో వి«ధులు నిర్వహిస్తున్న విజయలక్ష్మికి తీవ్రగాయాలు కాగా ఆమెను చికిత్స నిమిత్తం కోదాడకు, అక్కడినుంచి ఖమ్మంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న పాపయ్యను నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. రెవెన్యూలో అసిస్టెంట్‌ సెక్రటరీగా పనిచేస్తున్న బోరెడ్డి రఘువీరాంజనేయులు, డ్రైవర్‌ సయ్యద్‌ ఖలీల్‌ కోదాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై రఘువీరాంజనేయులు ఫిర్యాదు మేరకు రూరల్‌ సీఐ రవి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

క్షతగాత్రులను పరామర్శించిన స్పెషల్‌ సీఎస్‌
ఏపీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ( భూపరిపాలన విభాగాధిపతి) మదన్‌మోహన్, ఐఏఎస్‌ అధికారి చక్రవర్తి కోదాడకు చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న మృతదేహాలను సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు.

వైఎస్‌ జగన్‌ సంతాపం
సాక్షి, అమరావతి: ఏపీ సచివాలయానికి చెందిన ఇద్దరు ఉద్యోగులు సోమవారం తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మరిన్ని వార్తలు