‘దాడి చేస్తాం, ముట్టడిస్తామనేది సరైన పద్దతి కాదు’

19 Jan, 2020 17:39 IST|Sakshi

సాక్షి, విజయవాడ : చట్ట సభలకు హాజరు కాకుండా నిరోదించడమనేది సభా హక్కులను హరించడమే అవుతుందని ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. సభ్యుల హక్కులను హరిస్తే రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఎవరైనా వ్యవహరిస్తే చట్టం కచ్చితంగా తన పని తాను చేస్తోందని హెచ్చరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపు(సోమవారం) శాసన సభ సమావేశాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సభలు నిర్వహించకుండా ఎవరైనా అడ్డుకుంటే అది సభా హక్కుల ఉల్లంఘన అవుతుందన్నారు.

చట్టానికి లోబడి ఎవరైనా నిరసన తెలియజేయవచ్చునని అన్నారు. సభ్యుల సమస్యలు సభలో ఎవరైనా చెప్పుకోవచ్చని, అంతే కాని దాడులు చేస్తాం. ముట్టడిస్తామనేది సరైన పద్ధతి కాదన్నారు. సభకు సభ్యులు రాకుండా అడ్డుకోవడం కూడా నేరమే అని, అలాంటి వారిపై చర్యలు తీసుకునే హక్కు సభకు ఉందని స్పీకర్‌ పేర్కొన్నారు. సభ్యుల హక్కులను కాపాడాల్సిన అవసరాన్ని రాజ్యాంగం కల్పించిందని గుర్తుచేశారు. రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వంతో చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. సభ సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని స్పీకర్‌ తమ్మినేని కోరారు. 

మరిన్ని వార్తలు