హోదా ఇవ్వకుంటే బీజేపీ పతనమే

26 Jul, 2018 07:32 IST|Sakshi
మానవహారానికి వెళ్తున్న జేఏసీ నేతలు

కర్నూలు(అర్బన్‌): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో పొందుపరిచిన హామీలన్నింటినీ అమలు చేయకపోతే  బీజేపీకి రాజకీయంగా పతనం తప్పదని విద్యార్థి, జేఏసీ నేతలు హెచ్చరించారు. జేఏసీ రాష్ట్ర నాయకుడు జే లక్ష్మినరసింహ అధ్యక్షతన బుధవారం స్థానిక అంబేద్కర్‌ భవన్‌ ప్రాంగణంలో ‘ ద బిగ్‌ ఫైట్‌ ’ పేరుతో కోటి మంది విద్యార్థుల మానవహారం కార్యక్రమంలో భాగంగా భారీ బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ కర్నూలు అసెంబ్లీ ఇన్‌చార్జీ హఫీజ్‌ఖాన్, సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టీ షడ్రక్, జిల్లా కార్యదర్శి కే ప్రభాకర్‌రెడ్డి, సీపీఐ (ఎంఎల్‌) జిల్లా కార్యదర్శి యు మల్లికార్జున హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హాదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయడంతో నరేంద్రమోదీ దుర్మార్గ వైఖరి వెల్లడైందన్నారు.

నాలుగు సంవత్సరాలుగా మన రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ కన్వీనర్‌ శ్రీరాములుగౌడ్, కో కన్వీనర్లు కారుమంచి, భాస్కర్, సురేంద్ర, నాగేష్‌ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల వరకు హోదా కంటే ప్యాకేజి మే లని వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు ప్రజలను నమ్మించేందుకు చేసిన ప్రయత్నాన్ని ప్రజలు వ్యతిరేకించారన్నారు. చేసేదేమి లేక  వారు  తిరిగి హోదా అంటూ ప్లేటు మార్చారని ఆరోపించారు.

రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై విద్యార్థి, యువజనులు గళమెత్తాలని  పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థి, యువజనులు రాజ్‌విహార్‌ సెంటర్, కొత్త బస్టాండ్‌ ప్రాంతాల్లో మానవహారంగా ఏర్పడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిపిఐ నగర కార్యదర్శి పీ గోవిందు, సహాయ కార్యదర్శి జీ చంద్రశేఖర్, జనసేన నాయకులు హర్శద్, జేఏసీ నాయకులు సోమన్న, ప్రతాప్, శరత్, శివకృష్ణ, సాయి, నమణ, మహిళా నాయకురాళ్లు నిర్మల, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు