‘ప్రత్యేక హోదా’ను 15వ ఆర్థిక సంఘానికి నివేదించాం

17 Jul, 2019 04:00 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎంపీ వంగా గీత ప్రశ్నకు కేంద్రం జవాబు

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వర్తింపచేయాలంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మే 26, 2019న కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారని, దీన్ని 15వ ఆర్థిక సంఘం పరిశీలనకు పంపామని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు ఈ అంశం ముగిసిన అధ్యాయమని చెబుతూ వచ్చిన కేంద్రం తాజాగా ఈ అంశాన్ని 15వ ఆర్థిక సంఘానికి నివేదించామని చెప్పడం కీలకమలుపుగా భావించవచ్చు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్‌ అడిగిన పలు ప్రశ్నలకు మంగళవారం కేంద్ర మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థనలు వచ్చాయి. తాజాగా మే 26న ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి నుంచి వచ్చిన అభ్యర్థనను 15వ ఆర్థిక సంఘం పరిశీలనకు పంపాం..’ అని పేర్కొన్నారు. సమాధానాన్ని కొనసాగిస్తూ.. ప్రత్యేక హోదా రాష్ట్రాలు, సాధారణ రాష్ట్రాలకు మధ్య 14వ ఆర్థిక సంఘం వ్యత్యాసం చూపలేదని, తద్వారా ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయిందని పేర్కొన్నారు. అయితే నీతిఆయోగ్‌ సిఫారసుల మేరకు ప్రత్యేక ప్యాకేజీ అందిస్తున్నట్టు తెలిపారు. 

మరిన్ని వార్తలు