సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా నెల్లూరీయుడు

9 Mar, 2014 03:15 IST|Sakshi

నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్ : సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా నెల్లూరు సమీపంలోని కనుపర్తిపాడు వాసి పెనుబల్లి మధు ఎన్నికయ్యారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయనను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విద్యార్థి దశ నుంచే మధు వామపక్ష భావాలు కలిగి ఉండేవారు. 1970లో ఎస్‌ఎఫ్‌ఐని స్థాపించడంలో కీలక పాత్ర వహించేవారిలో ఒకరిగా పనిచేశారు. నెల్లూరు వీఆర్ హైస్కూల్లో పదోతరగతి , అదే కళాశాలలో డిగ్రీ వరకు చదివారు.
 
 1968లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. అప్పట నుంచి డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, రైతు సంఘాలతో పాటు పలుసంఘాల్లో కీలక భూమిక పోషించారు. హైదరాబాద్‌లో ట్రేడ్ యూనియన్ నిర్మించడంలో ప్రధాన పాత్ర పోషించారు. అక్కడే పాతబస్తీలో ఎంఐఎం సభ్యులను ఎదుర్కొని ధైర్యంగా ఉద్యమాన్ని నిర్మించారు. ఈ క్రమం లో ఆయనపై ఎంఐఎం సభ్యుల దాడి కూడా జరిగింది.
 
 ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. గతంలో రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. ప్రస్తుతం సీపీఎం జిల్లా ఇన్‌చార్జి, కేంద్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలు వహిస్తూ రాష్ట్ర కార్యదర్శిగాఎన్నికయ్యారు. దీంతో జిల్లా వాసులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
 

మరిన్ని వార్తలు