జేఈఈలో జాతీయ టాపర్‌గా జితేంద్ర

19 Jan, 2020 04:30 IST|Sakshi

100 శాతం పర్సంటైల్‌తో రికార్డు సృష్టించిన ఏపీ విద్యార్థి

జితేంద్ర స్వస్థలం విజయనగరం జిల్లా లవిడాం గ్రామం

బాంబే ఐఐటీలో చదవాలన్నదే నా లక్ష్యం: జితేంద్ర

గుర్ల (చీపురుపల్లి): బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ (జేఈఈ) – మెయిన్స్‌ పరీక్షలో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థి లండ జితేంద్ర జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించి సత్తా చాటాడు. విజయనగరం జిల్లా గుర్ల మండలం లవిడాం గ్రామానికి చెందిన జితేంద్ర జేఈఈ మెయిన్స్‌లో 100 శాతం పర్సంటైల్‌ సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. మొదటి ర్యాంకు సాధించగలనని ముందు నుంచి ఆశతో ఉన్నానని, ఊహించినట్టే ఫలితాలు వచ్చాయని తన సంతోషాన్ని ‘సాక్షి’తో పంచుకున్నాడు.

తమది రైతు కుటుంబమని, ఈ విజయానికి తన తల్లిదండ్రులు వెంకటరమణ, మంగమ్మ, చిన్నాన్న కామునాయుడు, పిన్ని ఆదిలక్ష్మి, ఉపాధ్యాయులే కారణమని తెలిపాడు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, రాత్రి 10 గంటల వరకు కష్టపడి చదవడం వల్ల పరీక్షల్లో రాణించగలిగానని వివరించాడు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించి బాంబే ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ చేయాలన్నదే తన లక్ష్యమన్నాడు.

బీటెక్‌ పూర్తి చేశాక మంచి ఉద్యోగం సాధిస్తానని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు. కాగా, జితేంద్ర 1 నుంచి 5వ తరగతి వరకు చీపురుపల్లిలో, 6 నుంచి 10వ తరగతి వరకు రాజమండ్రిలో, ఇంటర్మీడియెట్‌ విజయవాడలో చదివాడు. పదో తరగతిలో 10 జీపీఏ సాధించడంతో ఇంటర్‌లో ఉచితంగా సీటు వచ్చింది. జేఈఈ మెయిన్స్‌కు కూడా ఉచితంగానే శిక్షణ లభించింది. కాగా, జితేంద్ర సోదరి హేమ ఐఐటీ మద్రాస్‌లో ఇంజనీరింగ్‌ చదువుతోంది.  

మరిన్ని వార్తలు