ఇంటి నుంచే పౌరసేవలు

20 Jun, 2014 01:01 IST|Sakshi
ఇంటి నుంచే పౌరసేవలు

విజయనగరం కంటోన్మెంట్: ఇక నుంచి కాగితం, పెన్నూ తీసుకుని దరఖాస్తు రాసి లైన్లో నుంచోవక్కరలేదు. ఇంటి నుంచే మీక్కావాల్సిన సమాచారాన్ని, పౌరసేవలనూ పొందొచ్చు.  ఏపీ టెక్నాలజీ సర్వీసెస్  రూపొందిస్తున్న వెబ్‌సైట్‌లోకెళ్తే చాలు మీక్కావల్సిన సమాచారం వస్తుంది. పలు సేవలకోసం అప్లై  చేసుకోవచ్చు. లేదా నేరుగా పలు పౌరసేవలను కూడా పొందవచ్చు. అంతే కాకుండా టూరిజంకు సంబంధించిన అన్ని వివరాలనూ పొందవచ్చు. అన్ని రకాల సేవలనూ ఈ పోర్టల్ ద్వారా పొందేవిధంగా తయారు చేస్తున్నారు.   ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆయా జిల్లాల పేరున పోర్టల్‌ను ప్రారంభించనున్నారు.
 
 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఇందులో పొందు పరుస్తారు. దీనికి సంబంధించి ప్రస్తుతం డేటా సేకరణ జరుగుతోంది.  కలెక్టర్ కాంతిలాల్ దండే, జేసీ బి రామారావు, డీఆర్వో హేమసుందర్‌లను ఆర్బివా టెక్నాలజీస్ మేనేజర్ ప్రభాకర రావు గురువారం కలిసి పోర్టల్ సమగ్ర స్వరూపాన్ని వారికి వివరించారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని శాఖల సమాచారాన్ని పొందడానికి అనుమతుల కోసం వచ్చామని ఆయన తెలిపారు. దీని ప్రోమోను కలెక్టర్ కాంతిలాల్ దండే, జేసీ బి రామారావులకు చూపించారు. దీంతో  కలెక్టర్ డేటా సమకూర్చే బాధ్యతను డీఆర్వోకు అప్పగించారు.  త్వరలో ప్రారంభం కానున్న ఈ పోర్టల్ ద్వారా ఆధార్ నమోదు, ఈ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయని మేనేజర్ ప్రభాకరరావు తెలిపారు.
 

మరిన్ని వార్తలు